కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది కమలం. ప్రజల గోసను ఏనాడూ పట్టించుకోని బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. దశాబ్దాల కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు సాగించిన పోరాటానికి ఫలితంగా కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనానికి తొలి అడుగు పడింది. మంత్రి కేటీఆర్ చొరవతో దిగివచ్చిన కేంద్రం..విలీనంపై విధివిధానాల రూపకల్పనకు హైపవర్ కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో ఎక్కడ రాష్ట్ర సర్కారుకు పేరొస్తుందేమోనని.. భయపడుతున్న బీజేపీ నాయకులు.. కొత్త డ్రామాలను మొదలుపెట్టారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు స్థానిక బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో విలీనమే వద్దంటూ వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ప్రగతిని కోరుకుంటామని అంటూనే.. ప్రజాభిప్రాయం ప్రకారమే బీజేపీ నడుస్తుందంటూ చెబుతూనే విలీనం ద్వారా ఒరిగేదేం లేదంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో సైతం అభివృద్ధి జరగడం లేదంటూ నోరు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించకుండా మోకాలడ్డడం నిత్యకృత్యమైందని మండిపడుతున్నారు. బల్దియాలో విలీనమైతే.. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
సికింద్రాబాద్, జనవరి 7: ఎన్నో దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు సాగించిన పోరాటానికి త్వరలోనే మోక్షం లభిస్తున్న తరుణంలో బీజేపీ మరో భారీ కుట్రకు తెరలేపింది. రెండు రోజుల కింద కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీలో కలిపేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ హైపవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి ఈ కమిటీ 30 రోజుల్లోగా విధివిధానాలను ఖరారు చేస్తూ నివేదికను సమర్పించాలని ఆదేశాల్లో జారీ చేసింది.
దీంట్లో భాగంగా కమిటీ ఏర్పాటు నిర్ణయంతో అన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కమిటీ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ఎక్కడ రాష్ట్ర సర్కారుకు పేరు వస్తుందోనని కొత్త డ్రామాలకు తెరలేపారు. అనుకున్నదే తడవుగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు స్థానిక బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో విలీనమే వద్దంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కంటోన్మెంట్ ప్రగతిని కోరుకుంటామంటూనే, ప్రజాభిప్రాయం ప్రకారమే బీజేపీ నడుస్తుందంటూ చెబుతూనే విలీనం ద్వారా ఏమీ ఒరగదంటూ మాట్లాడుతున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని బల్దియాలో విలీనం చేసే అంశంపై త్వరలోనే జిల్లా బీజేపీ సమావేశంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చిస్తామని కాషాయ నేతలు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కమిటీ పర్యటన నేపథ్యంలో తాము సవివరంగా విలీన ప్రతిపాదనపై అభిప్రాయం చెబుతామన్నారు. కానీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలనే విషయంపై స్పష్టత లేని కాషాయ పార్టీ పై కంటోన్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించకుండా మోకాలడ్డటం నిత్యకృత్యమైందని మండిపడుతున్నారు.
ప్రజలను మభ్య పెట్టడమే కమలం నేతలకు తెలిసిన విద్య. అందరూ ఒకదారైతే బీజేపీది మరోదారి. ప్రధానంగా జనాల్లో గందరగోళం సృష్టిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. లోకల్ మిలిటరీ అధికారులు నిత్యం ఏదో ఒక రోడ్డును మూసివేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నా… కనీసం మాట్లాడని కాషాయ నేతలు నేడు మాత్రం విలీనం అడుగులు ముందుకు పడుతుంటే వెనక్కి లాగేందుకు కుట్రలు పన్నుతున్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మాత్రం విడుదల చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సుమారు రూ.800కోట్ల బకాయిలో కనీసం రూ.100కోట్లను బోర్డుకు రప్పించినా కంటోన్మెంట్ ప్రాంతంలో సకల సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేసే ప్రక్రియ వేగవంతం అవుతున్న నేపథ్యంలో బీజేపీ మరోసారి కుట్రలకు తెరలేపుతున్నది. రోడ్ల మూసివేత నుంచి ఇండ్లు నిర్మించుకొనే వరకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎన్నో ఏండ్ల నుంచి వస్తోంది. దానికి అనుగుణంగా రాష్ట్ర సర్కారు, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కృషి చేశారు.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్
కంటోన్మెంట్ విలీనానికి బీజేపీ మోకాలడ్డితే జనాలే తిరగబడుతారు. నగరం నడిబొడ్డున కంటోన్మెంట్ ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. బస్తీలు, కాలనీల్లో సమస్యలు ఉన్నప్పటికీ రక్షణశాఖ ఏ మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోంది. విలీనానికి మద్దతు ప్రకటించకుండా విలీనం జరిగితే ఏమీ ఒరగదంటూ మాట్లాడటం శోచనీయం. ప్రజా అవసరాలను కనీసం పట్టించుకోని బీజేపీ… కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో తన ఉనికిని కాపాడుకునేందుకు సర్కారుపై ఆక్రోశం కక్కుతున్నది.
– టీఎన్. శ్రీనివాస్, మాజీ చైర్మన్, బోయిన్పల్లి మార్కెట్