సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో పంట ఉత్పత్తులు భారీగా పెరిగాయని, కేంద్రం వైఖరి వల్లే రాష్ట్ర రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన రైతుబంధు సంబురాల్లో
మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ట్రాక్టర్‌పై తిరిగి రైతులతో మాట్లాడారు.
మేడ్చల్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్ రూరల్ : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి అదనపు ఉత్పత్తికి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల పరిధి అవుషాపూర్, అంకుషాపూర్, కొర్రెముల, ప్రతాపసింగారం, కాచవానిసింగారం గ్రామాల్లో ఆదివారం జరిగిన రైతుబంధు సంబురాల్లో రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి మాట్లాడుతూ.. కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు పండించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పతంగులపై రైతుల చిత్రపటాలను ముద్రించి ఎగుర వేయాలని సూచించారు. కొర్రెముల గ్రామంలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి నాగలిని బహూకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ యూనివర్శిటీ చైర్మన్ భద్రారెడ్డి, సెక్రటరీ ప్రీతిరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, సర్పంచ్‌లు కావేరి, వెంకటేశ్ గౌడ్, వెంకట్‌రెడ్డి, శివశంకర్, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
ఖబడ్దార్.. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి
శామీర్‌పేట: ఖబడ్దార్.. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. మీకు, మీ పార్టీకి దమ్ముంటే బీజేపీ పాలిస్తున్న 15 రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ ఇవ్వండి.. అంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. శామీర్‌పేట మండలంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్న మంత్రి సవాల్ విసిరారు. రైతుబంధు సంబురాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నడ్డా, చౌహాన్ అంటూ వచ్చి ఏదేదో మాట్లాడి పోతున్నారు.. నోటికి వచ్చింది మాట్లాడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఆర్.యాదగిరి, సర్పంచ్‌లు భాస్కర్, కవిత వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ యూసఫ్బాబా, కో ఆఫ్షన్ సభ్యుడు జహీరుద్దీన్, ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అన్నదాత బలోపేతం
మేడ్చల్ రూరల్ : కేంద్రం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలు, కుట్రలను రైతులు ఖండించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మండలం గౌడవెల్లిలో ఆదివారం ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతుబంధు సంబురాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ధాన్యం ఉత్పత్తిని పెంచితే రైతులను ప్రోత్సహించాల్సింది పోయి ధాన్యం కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేసిందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతులకు నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడికి పైసలివ్వడం, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీటీసీ శైలజా విజయేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి ఎడ్యూకేషన్ సొసైటీ డైరెక్టర్ శాలినీరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు సంబురాలు
సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ ): రైతుబంధు పథకం ద్వారా రూ.50 వేల కోట్లు రైతులకు పంట పెట్టుబడి కోసం అందించిన సందర్భాన్ని పురసరించుకొని సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు వేడుకలు నిర్వహిస్తున్నట్లు పద్మారావునగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.