సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జేఎన్టీయూ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలని కాలేజీ యాజమాన్యాలకు, ప్రిన్సిపాల్స్‌కు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
నాణ్యమైన విద్యా విధానం అందుబాటులోకి తీసుకురావాలంటే విద్యార్థులు తప్పకుండా పాఠశాలలు, కళాశాలలకు రావాలన్నారు. అయితే అన్ని కాలేజీలు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన డాటా కూడా తప్పకుండా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ఎంటెక్, ఎం ఫార్మసీతో పాటు బీటెక్, బీ ఫార్మసీ విద్యార్థులకు కూడా ఇక నుంచి బయోమెట్రిక్ అనివార్యమని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.