సిటీ బ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జలమండలిలో 20 ఏండ్లుగా సేవలందిస్తున్న బిల్ కలెక్టర్లు లేదా మీటర్ రీడర్స్ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఔట్ సోర్సింగ్ జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న 673 మంది తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం ముందు శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో నంబర్ 60 ప్రకారం ఇప్పటిదాకా రూ.15,600 జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు ఏకంగా డైలీ వేజ్ కిందకు మార్చేలా కొత్త టెండర్ తీసుకొచ్చి రోడ్డున పడేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొత్త నిబంధనలతో తమ జీవితాలను అగాధంలోకి నెట్టేయవద్దని గతనెల 6 నుంచి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పట్టించుకోవడం లేదని వాపోయారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లకు అన్యాయం చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డైలీ వేజ్లో మార్చి శ్రమకు తగ్గ ఫలితాలు అందకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 20 ఏండ్ల నుంచి చాలీచాలనీ జీతాలతో జలమండలికి సేవ చేస్తున్నామన్నారు. కనీస వేతనం చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నా పట్టించుకోకుండా ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కమీషన్లకు కక్కుర్తిపడి తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మీటర్ రీడర్లను డైలీ వేజ్లోకి మార్చే కొత్త టెండర్‌ను వెంటనే రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జలమండలిలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జీవో 60 ప్రకారం వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎంఏయూడీలో సాంక్షన్డ్ పోస్టుల కింద మీటర్ రీడర్స్‌ను చూపిస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కనీస మౌలిక వసతులు కల్పిస్తూ జలమండలి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. జలమండలి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం స్పందించి తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం, జలమండలి స్పందించకుంటే తమ హక్కులు, ఉద్యోగభద్రతను కాపాడుకోవడానికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.