సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉండి బీదర్‌లో ఏటీఎం దోపిడీకి దొంగలు స్కెచ్ వేసినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. పోలీసుల గాలింపు ముమ్మరం కావడంతో దోపిడీ దొంగలు రాష్ర్టాన్ని దాటి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు బీదర్‌లో దోపిడీకి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని మంగళవారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లోని పార్కింగ్ ఏరియా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్‌లో దోపిడీకి ఉపయోగించిన బైక్ నంబర్ ఏపీకి సంబంధించింది కావడంతో హైదరాబాద్‌తో లింక్ ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తూ వచ్చారు.
బీదర్‌లో దోపిడీ చేసి హైదరాబాద్‌కు చేరుకున్న దొంగలు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ఎటు వెళ్లారు అనే కోణంలో విశ్లేషించడంతో అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి గజ్వేల్‌కు వెళ్లాలనే ప్లాన్‌లో ఆటో ఎక్కి మార్గమధ్యలో తిరుమలగిరిలోనే దిగిపోయినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను పోలీసులు పట్టుకొని విచారిస్తే తాము గజ్వేల్ వెళ్తున్నట్లు పోలీసులకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో తమ రూట్‌ను దోపిడీ దొంగలు మార్చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే దుండగులు ఆదిలాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి మహారాష్ట్రలోకి వెళ్లిపోయి ఉంటారని, ఆ దిశగా కొన్ని ఆధారాలు పోలీసులు సేకరించారు. ఇదిలా ఉండగా అసలు అఫ్జల్‌గంజ్‌కు దుండగులు ఎలా వచ్చారనే విషయంపై నగరంలోని వివిధ రూట్లలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు ఆటోలో వచ్చినట్లు సీసీ కెమెరాలలో పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎంజీబీఎస్ లోపల, బయటి పరిసరాలలో సీసీ కెమెరాలను పరిశీలించడంతో పార్కింగ్ ఏరియాలో ఒక బైక్‌ను గుర్తించారు. అదే బైక్‌ను దుండగులు బీదర్‌లో దోపిడీకి ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకు ట్విస్ట్లిస్తున్న ఈ బీదర్ దోపిడీ గ్యాంగ్ మహారాష్ట్రనే ప్రస్తుతం సమయంలో సేఫ్ జోన్‌గా భావించి ఉండే అవకాశాలున్నాయని, దీంతోనే అక్కడకు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.