ఘట్కేసర్, డిసెంబర్ 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘బస్తీ దవాఖాన’లతో నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు మండలానికి, మున్సిపాలిటీకి ఒక్కటి చొప్పున ఉన్న ప్రభుత్వ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రతి బస్తీకి ప్రభుత్వ దవాఖాన అందుబాటులో రావడంతో నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిచండానికి కృషి జరుగుతుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ బస్తీ దవాఖానలు మంచి ఫలితాలను ఇస్తూ, ప్రజల మన్నలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సీ నగర్, కొండాపూర్లలో ఏర్పాటు దశలో ఉండగా, బాలాజీ నగరంలో వైద్య సేవలు అందిస్తుంది.
పోచారం మున్సిపాలిటీలో యనంపేట్, పోచారంలో బస్తీ దవాఖానల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అన్నోజిగూడ ఆర్జికెలో పక్కా నూతన భవనంలో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ దవాఖానలలో ఎంబీబీఎస్ వైద్యుడు, స్టాప్ నర్స్, అటెండర్ మొత్తం ముగ్గురు విధు లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు సాధారణ జబ్బులతో పాటు, ధీర్ఘకాలి వ్యాధులను కూడా చికిత్సలు అందిస్తున్నారు. ఉచితంగా మందులను అందజేస్తున్నారు. పెద్ద వ్యాధులను గుర్తించి స్థానిక ఏరియా దవాఖాన, ఉస్మానియా, గాంధీ దవాఖానలకు పంపిస్తున్నారు. ఈ బస్తీ దవాఖానల్లో ప్రతిరోజు 80 నుంచి 100 మంది రోగులు వచ్చి వైద్య సేవలను పొందుతున్నారు. త్వరలో అన్ని బస్తీ దవాఖానల్లో ప్రజల ఆరోగ్యానికి కావాల్సిన అన్ని రకాల పరీక్షలను నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పరీక్షల కోసం పీహెచ్సీలకు, ఏరియా దవాఖానలకు పంపుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలతో ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు దూరమవుతున్నాయి. స్థానికంగా బస్తీ దవాఖాన ఉండడంతో ఎవరైనా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందుతున్నారు. గతంలో ఘట్కేసర్లో ప్రభుత్వ దవాఖానకు వెళ్ళాలంటే రైల్వే ట్రాక్దాటి వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఘట్కేసర్లో చాలా ఉన్నాయని, నేడు బాలాజీనగర్లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో ఇక్కడి ప్రజలకు మేలు జరిగింది. – పావని, మున్సిపాలిటీ చైర్పర్సన్