Belt Shops | సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలో బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిస అవుతూ..విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కంపౌండ్లతో పాటు బెల్టు షాప్‌ల నుంచి కూడా కొందరు లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ పోలీసులకు నెలవారీగా మాముళ్లు వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. అందుకే నగరంలో ఉన్న బెల్టు షాపులపై అటు లా అండ్ ఆర్డర్, ఇటు టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో వరుస ఏసీబీ దాడులు, అక్కడ పనిచేస్తున్న కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో నగర పోలీస్ ఉన్నతాధికారులు ప్రక్షాళన మొదలుపెట్టారు. అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాలు ఇతరాత్ర నెలవారీగా మాముళ్లు తీసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
అలాంటి అధికారుల వివరాలను రహస్యంగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ పోలీసుల్లో కూడా కదలిక వచ్చింది. ఇందులో భాగంగా బెల్టు షాపులపై దాడులు చేసి.. కొన్ని కేసులు నమోదు చేశారు. అయితే బెల్టు షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎవరు నిర్వహిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులకు పక్కాగా తెలిసి ఉన్నా.. ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడేమో.. నెమ్మదిగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిద్రలేచి దాడులు ప్రారంభించారన్న విమర్శలున్నాయి. నగరంలోని ఛత్రినాక, కుల్సుంపురా, కాచిగూడ, బోరబండ, సైదాబాద్ తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో భారీ స్థాయిలో బెల్టు షాపులున్నాయి. కొందరు కిరాణా దుకాణాలను అడ్డుపెట్టుకొని వీటిని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా.. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గ్రామానికి రెండు మూడు బెల్టు షాపులు ఉండటం గమనార్హం.
మద్యం దుకాణాల నుంచి ఆదాయాన్ని పెంచడం ఎక్సైజ్ శాఖ ఒక పనిగా పెట్టుకొని.. విక్రయాలు ఎక్కువగా చేసే వారిని ప్రోత్సహిస్తున్నదనే వాదన వినిపిస్తున్నది. ఇదే అదునుగా స్థానిక పోలీసులు సైతం చూసీ చూడనట్లు వదిలేయడం, నెలవారీగా అందిన కాడికి మాముళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయే దుకాణాల్లో ఏమి విక్రయాలు సాగుతున్నాయనే పక్కా సమాచారం స్థానిక పెట్రోలింగ్ సిబ్బందికి ఉంటుంది. అయితే కిందిస్థాయి నుంచి పై అధికారుల వరకు ఒక్కో విధంగా మాముళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. జాతీయ సెలవు దినాలు, ఎన్నికలు, పండుగలు తదితర సందర్భాల్లో శాంతి భద్రతల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయిస్తుంది. ఆ సమయాల్లో కొందరు దుకాణాదారులు ఎక్కువ స్టాక్‌ను బెల్టు షాపులకు తరలించి.. ప్రత్యేకంగా ఆ రోజు జోరుగా వ్యాపారం చేయిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. సాధారణ దుకాణాలు రాత్రి 10.30 గంటలకే బంద్ అయితే, బెల్టు షాపుల్లో మాత్రం 24/7 మద్యం దొరకుతున్నది. ఇదంతా పోలీసులకు తెలిసినా.. నెలవారీగా అందుతున్న మామూళ్ల వల్లే ఆ వైపు చూడటం లేదన్న విమర్శలున్నాయి.