Income Certificate | బేగంపేట, ఏప్రిల్ 10: తెలంగాణ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లను పొందడానికి బ్రోకర్లను ఎట్టి పరిస్థితిలో అశ్రయించవద్దని సికింద్రాబాద్ తహశీల్దార్ పాండు నాయక్ సూచించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పథకానికి అవసరమైన ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు మీ సేవా కేంద్రంలో ధరఖాస్తులు పెట్టుకోవాలని తహశీల్దార్ పాండు నాయక్ తెలిపారు. మీ సేవలో దరఖాస్తు చేసిన మూడు రోజుల్లో తహశీల్దార్ కార్యాలయం నుంచి ఆ సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగంగా చేస్తామని చెప్పి లబ్ధిదారులకు కొంతమంది దళారులు మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇలాగే దళారులు వస్తున్నారని తెలిసి, వారిపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ విషయంలో కిందిస్థాయి సిబ్బంది కూడా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్టిఫికెట్లు అత్యవసరం ఉన్న లబ్ధిదారులు నేరుగా వారి సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.