సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పతంగుల ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా ప్రశాంతతకు భంగం కల్గించకుండా నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాలలో(పబ్లిక్ ప్లేస్) లౌడ్ స్పీకర్లు, డీజేలు పోలీసుల అనుమతి లేకుండా ఉపయోగించరాదని ఈ మేరకు 13వ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ద కాలుష్య నివారణకు ఆయా ఏరియాలలో శబ్దాలకు(డిజిబుల్స్) సంబంధించిన పరిమితులున్నాయని తెలిపారు.
ఇండస్ట్రీయల్ ఏరియాలో(పగలు 75 డిజిబుల్స్, రాత్రి 70 డిజిబుల్స్), కమర్షియల్ ఏరియాలో (పగలు 65 డిజిబుల్స్, రాత్రి 55 డిజిబుల్స్), రెసిడెన్షియల్ ఏరియాలో (పగలు 55 డిజిబుల్స్, రాత్రి 45 డిజిబుల్స్), సైలెంట్ జోన్ (పగలు 50 డిజిబుల్స్, రాత్రి 40 డిజిబుల్స్) రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు ఉపయోగించరాదన్నారు.