బన్సీలాల్‌పేట్, ఆగస్టు 28 : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కోటా బీసీలకు కేటాయించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
మంగళవారం వారిని పోలీసులు అరెస్టు చేసి గాంధీ దవాఖానకు తరలించారు. బుధవారం రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాజారాం యాదవ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు రాజు, ఇన్చార్జి కే.వెంకట్ గౌడ్, బీసీ ఆజాద్ సంఘ్ అధ్యక్షుడు డి.మహేశ్ గౌడ్, కార్యదర్శి విజయ్‌కుమార్, అఖిలేశ్ గౌడ్, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షుడు నరహరి పరామర్శించి సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగా బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల న్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్, సంజయ్ నేత ఆరోగ్యం క్షీణిస్తున్నదని గాంధీ దవాఖాన వైద్యులు చెప్పారని, వారికి ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.