కవాడిగూడ, జనవరి 20: తెలంగాణ కళాకారులు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, అర్హులైన వారికి సాంస్కృతిక సారథిలో తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు దరువు అంజన్న ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మంగళవారం ఇందిరాపార్కు వద్ద పోరు దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు ఆర్.కష్ణయ్య, బీసీ జేఏసీ చైర్మన్ జూజుల శ్రీనివాస్‌గౌడ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాలు సాధించుకునే దిశగా కళాకారులు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కళాకారులకు వెంటనే ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథులైన ఉద్యమ కళాకారుల సంక్షేమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కళాకారుల బాధలు వివరించామన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత అర్హులైన ఉద్యమ కళాకారులను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కళాకారుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదన్నారు. గాయని విమలక్క మాట్లాడుతూ కళాకారుల ఆటపాటలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అటువంటి కళాకారులను ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు దరువు అంజన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిరుపేద కళాకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు మోహన్బైరాగి, రవికుమార్, కిరణ్, ఆరువురి వెంకన్న, తాడూరి శ్రీకాంత్, వెంకటాచారి, రామలింగం, చుక్కరామనర్సయ్య, పుష్పలత, శంకరమ్మ, కవిత, నర్మద, రమ, తదితర కళాకారులు పాల్గొన్నారు.