HYDRAA | బాలానగర్, ఆగస్టు 31: నగరంలో కొన్ని రోజులుగా హైడ్రా ఆగడాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా హైడ్రా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. తమ పాలిట శాపంగా ఎక్కడ మారుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ మండల పరిధి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్‌పేట బోయిన్ చెరువు సమీపంలోని హరిజన బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
రిట్ పిటిషన్ 14728 ఆఫ్ 2007 ప్రకారం, అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు హస్మత్‌పేట హరిజన బస్తీ వాసులకు ఇటీవల బాలానగర్ మండల అధికారులు 125 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా హరిజన బస్తీవాసులు మాత్రం హైడ్రాకు వంత పాడుతూ రెవెన్యూ అధికారులు తమకు నోటీసులు జారీ చేశారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా, అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల హైడ్రా మా ఇండ్లపై ఎక్కడ కన్ను వేస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు.
గత 45 సంవత్సరాలుగా 50, 70 గజాల స్థలాలలో ఇండ్లు కట్టుకొని, జీహెచ్ఎంసీ పన్నులు చెల్లిస్తున్నామని, కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు వారు వాపోతున్నారు. మేము ఇండ్లు కట్టుకున్న సమయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయి. తమ జోలికి ఎవరు రాలేదు. సదుపాయాలు కల్పించారు. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా బతుకులు ఆగం చేయాలని చూడటం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇండ్లు కూల్చి వేస్తామంటే మేం ఎక్కడ పోవాలె…? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవుని గుడికి నోటీసులేంది? 45 ఏండ్లుగా ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నం. ఇప్పుడు నోటీసులు ఇచ్చుడేంది. మాలాంటి పేదోళ్లంటే సర్కారోళ్ళకు అలుసుగా ఉన్నట్లుంది. పేదలకు సాయం చేస్తే వాళ్లకు కూడా మేలు జరుగుతది. మా బతుకులు ఆగం చేయాలని చూస్తుండ్రు. ఇది మంచిది కాదు. భర్త, కొడుకు చనిపోయిండ్రు. నేను బతుకుడే కష్టంగా ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా చేస్తామంటే ఎట్లా? నా బతుకు ఆగం చేయద్దు.
– తుణికి యాదమ్మ, హరిజన బస్తీ నివాసి
మా ఇండ్లు కూల్చి మమ్ములను రోడ్డున పడేయొద్దు. 30 ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నం. ఇప్పుడు నోటీసులిచ్చి పొమ్మంటే ఎక్కడ పోవాలె. ఎట్ల బతకాల్నొ అర్థం అయితలేదు. బాధతో తిండి కూడా తినాలనిపిస్తలేదు. మాలాంటి గరీబోల్లను ఇబ్బంది పెడితే ఎట్ల. మా గోడు ఎవరికి చెప్పాలె? ఎక్కడకి పోవాలె? మా బతుకులు ఆగం చేయొద్దు. గవర్నమెంటోళ్ళు పెద్దోళ్ల ఎంబడి పడాలె.., మా ఎంబడి పడితే.. ఏం లాభం? ఆలోచన చేసి మాకు న్యాయం చేయుండ్రి.
– ముత్ర సుజాత, హరిజన బస్తీ నివాసి