మంగళవారం 26 మే 2020
Hyderabad - May 23, 2020 , 00:52:05

పేదలకు ఉపశమనంగా మారిన బస్తీ దవాఖానలు గ్రేటర్‌లో మరో 45 వైద్యశాలలు ప్రారంభం

పేదలకు ఉపశమనంగా మారిన బస్తీ దవాఖానలు గ్రేటర్‌లో మరో 45 వైద్యశాలలు ప్రారంభం

వైద్యం, మందులు అన్నీ ఉచితమే, జూబ్లీహిల్స్‌ బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

గతంలో ఏ చిన్న రోగమొచ్చినా.. పెద్దాసుపత్రులకు పరుగులు పెట్టేవారు. బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవసరమైన చోట, అనువైన ప్రదేశాల్లో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ... ఈ వైద్యశాలలు అనతికాలంలోనే ఆదరాభిమానాలు  చూరగొన్నాయి. ఇప్పుడు ఇవి ప్రజలకు మరింత చేరువయ్యాయి. శుక్రవారం నగరంలో వివిధ ప్రాంతాల్లో కొత్తగా  మరో 45 బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాయి. కాగా,  జూబ్లీహిల్స్‌లోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌, వెంగళరావునగర్‌లోని యాదగిరినగర్‌లో మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి వైద్యశాలలను ప్రారంభించారు.  పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని,  వైద్యం, మందులు అన్నీ ఉచితంగానే అందిస్తున్నట్లు చెప్పారు.    -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

మరీ పెద్దవైతేనే పెద్దాసుపత్రులకు సిఫారసు l ఉస్మానియా, గాంధీలపై తగ్గనున్న ఒత్తిడి

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో: బస్తీ దవాఖానలు అందుబాటులోకి రావడంతో అటు ప్రజలకు వైద్యసేవలు చేరువకావడమే కాకుండా ఇటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, కోరంటి వంటి దవాఖానలపై భారం తగ్గుతోంది. చిన్నరోగాలను  బస్తీ దవాఖానాల ద్వారా నయం చేయడం, క్యాన్సర్‌ వంటి రోగాలు ప్రారంభ దశలోనే గుర్తించడంతో  పెద్ద దవాఖానల్లో అత్యవసర, క్లిష్ట మైన వైద్యసేవలపై మరింత ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి.  అట్టడుగు వర్గాల వారికి  వైద్యసేవలు చేరాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బస్తీదవాఖానలు సత్ఫలితాలిస్తున్నాయి. సాధారణంగా రోజువారి పనులు చేసుకునే ప్రజలు చిన్నపాటి జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, లేదా మెడికల్‌ షాపుకెళ్లి నాలుగు మందుబిల్లలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. తీరా రోగం ముదరడంతో పెద్ద దవాఖానలకు పరుగులు తీస్తుండడం పరిపాటి. దీనివల్ల వ్యాధులు ప్రబలడంతో పాటు రోగుల సంఖ్య పెరగడం, కోరంటి, ఉస్మానియా, గాంధీ వంటి దవాఖానలపై భారం పెరగడం జరిగేది. అంతేకాకుండా ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. బస్తీదవాఖానలు అందుబాటులోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బస్తీ దవాఖానలు పూర్తిగా ప్రజల నివాసాల మధ్యలో ఉండడంతో ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే  బస్తీదవాఖానను ఆశ్రయిస్తున్నారు.  ముఖ్యంగా డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌, డయేరియా, కలరా  తదితర సీజనల్‌ వ్యాధులకు బస్తీదవాఖానలతోనే అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. 

క్యూ కడుతున్న రోగులు: 

 హైదరాబాద్‌ జిల్లా, పాతబస్తీలోని ఈదీబజార్‌, మసీమాబాద్‌, జంగమ్మెట్‌, బల్కంపేట బస్తీ దవాఖానల్లో రోగుల సంఖ్య ప్రతిరోజు 200 దాటుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.జె.వెంకటి తెలిపారు. మరో 15 నుంచి 20 దవాఖానల్లో ప్రతిరోజు 150మంది రోగులు వైద్యసేవలు పొందుతున్నారు. బస్తీదవాఖానల్లో 55 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో 50నుంచి 60 శాతం వ్యాధులను బస్తీస్థాయిలోనే గుర్తించగలుగుతున్నారు. దీర్ఘకాలిక, పెద్ద సమస్యలున్నట్లు తేలితే పెద్ద దవాఖానలకు రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగులకు  125 రకాల మందులను అందుబాటులో ఉంచారు.  సాధారణంగా ఏదైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరకు వెళితే డాక్టర్‌ ఫీజుకంటే మందులకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. బస్తీదవాఖానల్లో 125రకాల మందులను అందుబాటులో ఉంచడం వల్ల నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందడమే కాకుండా ఆర్థిక భారం తగ్గుతున్నట్లు చికిత్స పొందుతున్న రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అందుబాటులోకి 168 దవాఖానలు: 

గ్రేటర్‌ పరిధిలో మొన్నటి వరకు మొత్తం 123 బస్తీ దవాఖానలు అందుబాటులో ఉండగా శుక్రవారం మరో 45 దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గ్రేటర్‌లో ఇప్పుడు 168 బస్తీ దవాఖానలు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గతంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 74 ఉండగా మరో 24 అందుబాటులోకి వచ్చాయి.  రంగారెడ్డి జిల్లా పరిధిలో 23 ఉండగా మరో 5 దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్‌ జిల్లా పరిధిలో 26 బస్తీ దవాఖానలు ఉండగా మరో 16 దవాఖానలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.logo