సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేస్తున్న టీడీఆర్, బిల్డ్ నౌ విధానాలను నేరుగా తెలుసుకునేందుకు జైపూర్ అభివృద్ధి సంస్థ కమిషనర్, అధికారుల బృందం గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. జైపూర్ అభివృద్ధి సంస్థ (జేడీఏ) కమిషనర్ ఆనంది నేతృత్వంలోని ప్రణాళిక డైరెక్టర్ ప్రీతి గుప్తా, ఐటీ సలహాదారు ఆర్కె శర్మా, అసిస్టెంట్ టౌన్‌ప్లానర్ రుషికేష్ కొల్టే, ఐటీ డిప్యూటీ డైరెక్టర్ పంకజ్ శర్మతో కూడిన ప్రతినిధి బృందం టీడీఆర్, బిల్డ్ నౌ అనే ఏకీకృత భవన, లేఅవుట్ అనుమతి వ్యవస్థల అధ్యయనం చేశారు. ఈ బృందానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వాగతం పలికారు.
టీడీఆర్ పాలసీ 2017లో ప్రవేశపెట్టిన పరిస్థితులు, పాలసీ ప్రయోజనాలు, భవన లే అవుట్ అనుమతులకు ఉద్దేశించిన బిల్డ్ పౌ సింగిల్ విండో ప్లాట్‌ఫామ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో అమల్లోకి వచ్చిన టీడీఆర్ పాలసీని జైపూర్ బృందం ప్రశంసించారు. ఇటువంటి విధానాలను జైపూర్ నగర పరిపాలన విభాగంలో అమలు చేసేందుకు కృషిచేస్తామని బృంద సభ్యులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ సీసీపీ కే శ్రీనివాస్, అదనపు సీసీపీలు గంగాధర్, ప్రదీప్‌కుమార్, ప్రతినిధుల అధ్యయన టూర్ సమన్వయకర్తలు రాజ్‌కుమార్, విల్సన్, టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.