Govt Lands | బడంగ్పేట్, మార్చి 22 : ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ తహసిల్దార్ ఇందిరా దేవి హెచ్చరించారు. బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లిలోని సర్వేనెంబర్ 241/1 లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించినట్లు పేర్కొన్నారు. ఫెన్సింగ్ వేయకుండా కొంతమంది కాంగ్రెస్ నేతలు రైతులతో వచ్చి ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులకు స్థానికుల మధ్యన వాగ్వివాదం చోటుచేసుకుంది. తాము కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకున్నట్లు స్థానికులు రెవెన్యూ అధికారులతో చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ఫెన్సింగ్ వేయనీయమని అడ్డుకున్నారు.
రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు వచ్చి ఫెన్సింగ్ వేయించారు. నిజమైన రైతులు ఉంటే పరిహారం ఇవ్వడానికి తాను సహకరిస్తానని మామిడిపల్లి రైతులతో తాసిల్దార్ చెప్పారు. మీ భూమి అయితే ఇంతకాలం ఎందుకు తీసుకోలేదని ఆమె వారిని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తుంటే అడ్డు తగలడం మంచి పద్ధతి కాదన్నారు. ఓసారి పరిశీలించి నిజమైన పేద ప్రజలు ఉంటే ప్రభుత్వపరంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎవరు కబ్జా చేసినా కూడా కేసులు నమోదు చేయిస్తామని అన్నారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేయిస్తామని పేర్కొన్నారు. మామిడిపల్లి రైతులు మాత్రం మాకు ఎలాగైనా న్యాయం చేయాలని తాసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు.