Badangpet | బడంగ్‌పేట, డిసెంబర్ 2: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్లో బడ్జెట్‌పై సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమావేశం దద్దరిల్లింది. సభ్యుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో సమావేశం గందరగోళంగా మారింది. సమావేశంలో జరుగుతున్న అంశాలు బయటకు పొక్కకుండా తలుపులు,కిటికీలు మూసి సమావేశం నిర్వహించారు. పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులకు అంతరాయం ఏర్పడింది.
ఎజెండాలో 25 అంశాలను చర్చించడానికి కొత్తగా నంబర్ ఇవ్వడం పట్ల సభ్యులు ఇదేం పద్ధతి అని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.52 కోట్లకు తీర్మానాలు పెట్టగా.. వార్షిక బడ్జెట్‌కు విరుద్ధంగా తీర్మానాలు చేయడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ఎంతో చెప్పాలని, తీర్మానాలు చేసిన పనులకు బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ లేకుండా పనులు చేస్తే బిల్లు ఎలా చెల్లిస్తారని వాదించారు. నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణిపై సభలో గందరగోళం నెలకొన్నది. రాత్రి వరకు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. 32 డివిజన్లలో కొంత మందికి మాత్రమే ఇష్టానుసారంగా నిధులు కేటాయించడం పట్ల సమావేశంలో సభ్యులు మండిపడ్డారు.
టెండర్ వేయకుండానేఅడ్వాన్స్ పనులు : కార్పొరేటర్ శంకర్
టెండర్ వేయకుండానే అడ్వాన్స్ పనులు ఎలా చేస్తారని గుర్రంగూడ కార్పొరేటర్ దడిగ శంకర్ ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్లో వార్షిక బడ్జెట్ ఎంతో తేల్చాలని పట్టుబట్టారు. మూడు కౌన్సిల్ సమావేశాల్లో రూ.160 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలిపారు. అసలు బడ్జెట్ లేకుండా అడ్డగోలుగా పనులు చేస్తే ఎలా అన్నారు. కొంత మంది కార్పొరేటర్లకు కోట్ల నిధులు ఏ పద్ధతి ప్రకారం కేటాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.టెండర్ ప్రక్రియ లేకుండానే అడ్వాన్స్‌గా పనులు ఎలా చేయిస్తారని అధికారులను నిలదీశారు.
అవసరమైన వాటికి నిధుల్లేవ్ : డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో అవసరమైన వాటికి నిధులు కేటాయించకుండా అనవసరమైన వాటికి నిధులు కేటాయిస్తున్నారని డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాలని ప్రతి సమావేశంలో తాను ప్రస్తావిస్తున్నప్పటికీ పట్టించుకోక పోవడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాలుకు బదులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని డివిజన్లకు కోట్ల నిధులు కేటాయించి.. తన డివిజన్‌కు మాత్రం తక్కువ నిధులు కేటాయించారని కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సమావేశంలో కమిషనర్ సరస్వతి, కార్పొరేటర్లు, మేనేజర్ నాగేశ్వర్రావు, డీఈలు యాదయ్య, రాజు, జ్యోతి, ఏఈ వినీల్ గౌడ్ ఉన్నారు.