Cold Allergy | సిటీబ్యూరో: సిటీలో ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో రోగులు దవాఖానల బాట పడుతున్నారు. వేసవిలో వైరస్ల ప్రభావం పెద్దగా ఉండదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కొన్ని రకాల విషజ్వరాలు నమోదవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్‌లో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి కేసులు పెరుగుతున్నట్లు గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఫీవర్ దవాఖానలో రోజువారీ ఓపీలో 40 శాతం దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో కూడుకున్న కేసులు అధికంగా ఉన్నాయి. ఉస్మానియాలో వస్తున్న కేసుల్లో 30 శాతం, గాంధీ దవాఖానలో 32 శాతం, బస్తీ దవాఖానలు, ఇతర ప్రభుత్వ దవాఖానల్లో 33 శాతం కోల్డ్ అలర్జీ కేసులు పెరిగాయి. కాగా, ఈ సందర్భంలోనే కలరా, డయేరియా రోగాలు కూడా నమోదుకావడం గమనార్హం. ఫీవర్ దవాఖానలో 1 కలరా, 58 డయేరియా, ఉస్మానియాలో 3 కలరా, 60 డయేరియా, గాంధీ దవాఖానలో 1 కలరా, 48 డయేరియా, నిలోఫర్‌లో 33 డయేరియా కేసులు నమోదయ్యాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒంటినొప్పులు, నీరసం, విరేచనాలు ఈ కోల్డ్ ఎలర్జీ లక్షణాలుగా ఉంటాయని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం విజృంభిస్తున్న జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలకు కోల్డ్ అలర్జీనే ప్రధాన కారణమని ప్రముఖ జనరల్ ఫిజీషియన్, యాదాద్రి-భువనగిరి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజారావు చెప్పారు. చాలా మంది ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లటి వస్తువులను మర్నాడు లేదా కొన్ని గంటల తరువాత వేడి చేసి తీసుకోవడం వల్ల కూడా ఈ కోల్డ్ అలర్జీ ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇళ్లలో ఉదయం వండిన అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలు మధ్యాహ్నం లేదా సాయంత్రానికే పాడవుతాయి. దానికి కారణం అందులోని బ్యాక్టీరియా అనేది అధిక ఉష్ణోగ్రతల వల్ల వృద్ధి చెందుతుంది. నిలువ చేసిన ఆహార పదార్థాలు లేదా కలుషిత ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎక్కువగా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ, హెపటైటిస్-ఈ (కామెర్లు) తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. వేసవిలో కలుషిత ఆహార పదార్థాలు, కలుషిత నీటి వల్ల కలరా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.