సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సమ్మెకు పిలుపునిస్తే ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మొఖం చాటేసిందని ఆటో సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న చర్చలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మౌనం వహించడం సరైంది కాదని వాపోయారు. ఆటో సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం బీఆర్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు మళ్లీ పిలుపునివ్వడం, ఆటో డ్రైవర్లతో ర్యాలీలు నిర్వహించడం, ధర్నా చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ సమ్మె విరమింపజేయడంపై నాయకులు పునరాలోచనలు చేశారు. ఇకపై పిలుపునిచ్చే విషయంలో స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చి కొన్ని గంటల ముందరన విరమింపజేయడంపై జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జేఏసీ నాయకులు ఇకపై జరిగే కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.