సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆటో, క్యాబ్, లారీ తదితర వాహన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నిరసనలో భాగంగా ఈనెల 6న ఆటో, లారీ, క్యాబ్ డ్రైవర్లందరూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు బీఆర్టీయూ క్యాబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నగేశ్ తెలిపారు. ప్రతి ఒక్క డ్రైవరన్న నిరసనకు కదిలొచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఉచిత బస్సుతో ఆటో, క్యాబ్ ట్రిప్‌లు తగ్గాయన్నారు.
తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయారు. చాలా మంది డ్రైవర్లు క్యాబ్, ఆటో ఉపాధికి దూరం కావాల్సి వచ్చిందని అన్నారు. వెయ్యి రోజులు పూర్తయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగానే ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈనెల 6న పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతామని పేర్కొన్నారు. బీఆర్టీయూ పిలుపులో భాగంగా వాహన రంగ కార్మికులు సర్కార్‌ను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించి ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. డ్రైవర్ల ర్యాలీ అనంతరం కలెక్టర్‌కు తమ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు.