న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్)తోపాటు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడే సీఎన్జీ, గృహాలు, పరిశ్రమలకు భూగర్భ పైపులైన్ల ద్వారా సరఫరా చేసే పీఎన్జీ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.6.28(5.46 శాతం) పెరిగి రూ. 121.28కి చేరింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థల గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1న లీటర్‌కు రూ.5 పెంపు తర్వాత తాజా పెంపు చోటుచేసుకుంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ వాటా 40 శాతం వరకు ఉంటుంది. ఇది ఆ సంస్థలపై ఖర్చుల భారాన్ని పెంచుతుంది. కాగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. 19 కిలోల సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరగా, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2 పెరిగి రూ.764కి చేరుకుంది.
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ధరలు భారీగా పెరిగిన తర్వాత తాజాగా మరోసారి ధరల పెంపు చోటుచేసుకుంది. ఫిబ్రవరి, జూన్ మధ్య కాలంలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,740.50 నుంచి రూ.3,113. 50కి పెరిగింది. అంటే రూ.1,373 మేర పెరుగుదల నమోదైంది. ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరిగాయి. ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,701కి చేరింది. కోల్‌కతాలో రూ.11.50 పెరిగి రూ.2,884కి, అలాగే చెన్నైలో రూ.10.50 పెరిగి రూ.2,916.50కి ధరలు చేరాయి. అయితే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.942 వద్ద యథాతథంగా కొనసాగుతున్నది. దీని ధరలో చివరిసారిగా జూన్ 7న సిలిండర్‌కు రూ.29 మేర పెంపు జరిగింది.
సీఎన్జీ, పీఎన్జీ ధరల పెంపు
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ మంగళవారం నుంచి సీఎన్జీ ధరలను కిలోకు రూ.2, దేశీయ పీఎన్జీ ధరలను ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1 పెంచింది. ముంబై, దాని పరిసర ప్రాంతాలలో సీఎన్జీ ధర ఇప్పుడు కిలోకు రూ.88గా ఉంది. ఈ పీఎన్జీ ధరల పెంపు సుమారు 30 లక్షల దేశీయ వినియోగదారులకు వర్తిస్తుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ ధరలతో ముడిపడి ఉన్న అధిక ఇన్పుట్ గ్యాస్ ఖర్చులనే ధరల పెంపునకు కారణంగా కంపెనీ పేర్కొంది.