బంజారాహిల్స్, నవంబర్ 25: పనిచేస్తున్న ఇంట్లో భారీ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేసిన సెక్యురిటీ గార్డుతోపాటు అతడికి సహకరించిన ఐదుగురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లో నివాసం ఉంటున్న పారిశ్రామికవేత్త అజయ్ అగర్వాల్‌కు బాలానగర్ ప్రాంతంలో కంపెనీలు ఉన్నాయి. అతడి ఇంట్లో ఏడాదిన్నర కాలంగా అనంతపురం ప్రాంతానికి చెందిన కే.దాదాపీర్(34) అనే యువకుడు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
రోజూ భారీ మొత్తంలో నగదుతో ఇంటికి వచ్చే అజయ్ అగర్వాల్ ఇంట్లో దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితుడైన గుంతకల్‌కు చెందిన మల్లెల సాయికుమార్(27)కు విషయం చెప్పాడు. డోన్‌కు చెందిన సంగు కృష్ణకాంత్(35), గురుస్వామి, పీలేరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ బాష(33), తిరుపతికి చెందిన టి.నర్సింహ చరణ్(32), గుంతకల్‌కు చెందిన చైతన్య(30)తో కలిసి స్కెచ్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 22న అర్ధరాత్రి అజయ్ అగర్వాల్ నివాసానికి చేరుకున్న నిందితులు ముందుగా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ దాదాచంద్తో పాటు ఇతర పనిమనుషుల గదుల్లోకి వెళ్లి వారిని తాళ్లతో బంధించడంతోపాటు నోటికి టేప్ వేయాలని నిర్ణయించుకున్నారు. వారిని బంధించిన తర్వాత లోనికి వెళ్లి అజయ్ అగర్వాల్ ఇంట్లో దోపిడీ చేయాలని పథకం వేసుకున్నారు.
ఈ క్రమంలో సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండే డ్రైవర్ దాదాచంద్ గదిలోకి మాస్కులు ధరించి వెళ్లిన దుండగులు కత్తులతో బెదిరిస్తూ అతడిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే నిద్రలోంచి లేచిన దాదాచంద్ కేకలు పెట్టడంతో నిందితులు అతడిపై కత్తితో దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో మరింత గట్టిగా కేకలు వేయడంతో దోపిడీకి వచ్చిన నిందితులు పారిపోయారు. దీనిని గుర్తించిన యజమాని అక్షయ్ అగర్వాల్ డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
కాగా ఇంట్లో పనిచేస్తున్న సెక్యురిటీ గార్డు దాదాపీర్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. దాదాపీర్‌తో పాటు గుంతకల్‌కు చెందిన సాయికుమార్ వేసిన ప్రణాళికలో భాగంగా దోపీడికి యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గురుస్వామి అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 3 కత్తులు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఇంట్లో భారీగా డబ్బులు ఉంటాయని, వాటిని తస్కరించి ఉడాయిస్తే లైఫ్ సెట్ అవుతుందనే ఆశతో దోపిడీకి యత్నించానని దాదాపీర్ పోలీసుల విచారణలో తెలిపారు.