హైదరాబాద్: బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లపై హోటల్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఫుడ్ విషయంలో ఫిర్యాదు చేసినందుకు సిబ్బందితో రక్తం వచ్చేలా కొట్టించాడు ఆ హోటల్ యజమాని. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగింది. హస్తినాపురంలోని దావత్ బిర్యానీ హౌస్కు కొందరు యువకులు బిర్యానీ తినడానికి వచ్చారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే అది వచ్చిన తర్వాత ఓ విషయంలో వారు హోటల్ యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆ యజమాని.. సిబ్బందితో వారిపై దాడిచేయించాడు. వారు విచక్షణా రహితంగా కొట్టడంతో వినియోగదారులకు తీవ్ర గాయాలయ్యాయి.
రక్తాలు వచ్చేలా కొట్టడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేశారు. వారిని దవాఖానకు తరలించారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. బిర్యానీ తినడానికి వస్తే కొడతారా అంటూ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.