మలక్‌పేట, జూన్ 20: అపరిశుభ్రమైన పరిసరాల్లో కుళ్లిపోయి బూజుపట్టిన ముడి పదార్థాలు, రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడిచేసిన చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెద్ద మొత్తంలో పేస్ట్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాహెద్‌నగర్‌లో రసాయనాలతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ మధు, సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం రాత్రి దాడి చేశారు.
కుళ్లిపోయి బూజుపట్టిన ముడి పదార్థాలతో తయారుచేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న తీరును గమనించిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. దుర్వాసన కొడుతున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా పాడవకుండా, దుర్వాసన కొట్టకుండా ప్రాణాంతకమైన ఎసిటిన్ యాసిడ్‌ను కలుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు బీహార్‌కు చెందిన మహ్మద్ ఫారూఖ్(48)ను అదుపులోకి తీసుకొని, నాలుగు క్వింటాళ్ల (400 కిలోల) ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాకింగ్ చేసిన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాక్స్‌లను, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకొని నిందితున్ని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.