సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరి.. అదును చూసి ఇంటి యజమానిని బంధించి భారీ దోపిడీకి పాల్పడిన నేపాల్ గ్యాంగ్‌ను ఎట్టకేలకు సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సీపీ కథనం ప్రకారం.. గత నెల 16న సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే వృద్ధ దంపతులైన ఓం ప్రకాశ్ అగర్వాల్, సంతోష్ అగర్వాల్‌ను బెదిరించి నేపాల్ ముఠా రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, రూ.8 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ బృందం దర్యాప్తు ప్రారంభించింది.
నేపాల్‌కు చెందిన దీపేశ్ శశి ఠాకూర్, అనిత్ షాహి అలియాస్ అనిత, జవీన్ బహదూర్ చంద్ అలియాస్ జీర, దేబి కడాల్, మహేందర్ బహదూర్ షాహి ఠాకూర్, ఆయుష్ బహదూర్ షాహి అలియాస్ వికాస్, లాల్ బహదూర్ షాహి ఠాకూర్, ఛాత్రబహదూర్ షాహి అలియాస్ చోటు, మీన, అమర్ బహదూర్ చాంద్ అలియాస్ అమ్జమ్ మొత్తం పది మంది ముఠాగా ఏర్పడ్డారు. ఖరీదైన ఇండ్లు చూసి అందులో వాచ్‌మన్‌గా, ఇంట్లో పనిచేసే వారిలా ఏజెంట్ల ద్వారా దిగుతారు.
అలాగే సైఫాబాద్‌లోని ఓం ప్రకాశ్ అగర్వాల్ ఇంట్లో ఛాత్ర షాహి, మీన ఈ ఏడాది ఆగస్టులో వాచ్‌మన్, ఇంట్లో పనిచేసే దంపతులుగా పనిలో కుదిరారు. ఒక నెల రోజులు దంపతులుగా అక్కడ పనిచేసి ఆ ఇంటి పూర్తి సమాచారాన్ని గ్యాంగ్ నాయకులైన దీపేశ్, జీవన్‌కు అందించారు. గ్యాంగ్ నాయకుల ఆదేశాలతో అక్కడ పని మానేసి ఇద్దరు బెంగళూర్‌లో మరో ఆపరేషన్‌లో చేరారు. దీంతో ఆ ఇంట్లో దీపేశ్, అనిత పనిలో చేరారు. వీరిద్దరు యజమానులకు నమ్మకం కుదిరేలా పనిచేశారు.
తమ ప్లాన్‌లో భాగంగా యజమానులకు నమ్మకం కుదరగానే అక్టోబర్ 15వ తేదీన గ్యాంగ్ సభ్యులంతా షేక్‌పేట్‌లో కలుసుకున్నారు. రాత్రి 7.30 గంటలకు దీపేశ్, అనిత వారు పనిచేస్తున్న ఇంటికి చేరుకోగా, మిగతా సభ్యులు ఆ సమీపంలో ఉండి అదును చూసి ఇంట్లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో దాక్కున్నారు. అర్ధరాత్రి 2 గంటల తరువాత అనిత నాల్గవ అంతస్తులో నిద్రిస్తున్న వృద్ధ దంపతుల గది తలుపులు తీసి అందరినీ అందులోకి పంపించింది. వారు పడుకున్న వృద్ధులను నిద్ర లేపారు. ఓంప్రకాశ్ అగర్వాల్‌ను తాళ్లతో కట్టేసి చితకబాధి హత్య చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అతడి భార్య సంతోష్ భయంతో వణికిపోయింది. వాళ్లు భయపడుతుండగానే బీరువా తాళాలు తీసి అందులో ఉన్న సొత్తును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
బయటకు వెళ్లిన తరువాత రెండు ఆటోల్లో షేక్‌పేట్‌కు వెళ్లారు. అక్కడ వాటాలు పంచుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆటోల్లో వెళ్లారు. అక్కడి నుంచి అద్దెకారులో ముంబాయికి వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల నుంచి కొందరు నేపాల్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు భారత సరిహద్దుల వరకు వెళ్లి నిందితుల కోసం గాలించారు. అయితే అప్పటికే కొందరు తప్పించుకున్నట్లు సమాచారం రావడంతో నేపాల్ పోలీసులకు దేబి కడాల్ గూర్చి సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రధానంగా ముంబాయి, హైదరాబాద్, బెంగళూర్‌లో ధనవంతుల ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
నిందితుల్లో కొందరు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం గ్యాంగ్ లీడర్లలో ఒకరైన దీపేశ్ షాహి ఠాకూర్, అనిత, చోటు, మీన, అమర్ బహదూర్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.8.8 లక్షల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న కీలక నిందితుడు జీవన్‌పై గతంలోనూ నగరంలో పలు కేసులున్నట్లు గుర్తించారు.