వెంగళరావునగర్, అక్టోబర్ 7: వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ బంగ్లాదేశ్ ముఠాకు చెందిన ఏడుగురిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బంగ్లాదేశ్‌కు చెందిన ఖుసుర్దాస్ నూర్‌మహ్మద్ కొలిబా, నహీదా దంపతులు 25 ఏండ్ల క్రితం దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. ప్రస్తుతం బొరబండలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఖుసుర్దాస్ సోదరుడు కాచి ముషర్రఫ్ సైతం దేశంలోకి అక్రమంగా చొరబడి.. నకిలీ ఆధార్ కార్డు పొందాడు. బోరబండలో ఉండే తన అన్నా, వదినలతో కలిసి వ్యభిచార దందా మొదలుపెట్టాడు. ముంబైలో స్థిరపడిన బంగ్లాదేశ్‌కు చెందిన షాబుద్దీన్, మిలన్ అనే ఇద్దరు వ్యభిచార కేంద్రం నిర్వాహకుల ద్వారా పశ్చిమ బెంగాల్ నుంచి ముగ్గురు యువతులను అతియార్ మొండల్ అనే వ్యక్తితో హైదరాబాద్‌కు పంపించి..వారితో బోరబండలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఛాతీ దవాఖాన సమీపంలోని బస్టాప్‌లో నిలబడి ఉండగా, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు యువతులతో పాటు మొండల్ అలియాస్ షాబుద్దీన్‌ను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఖుసుర్దాస్ దంపతులు, ముషర్రఫ్‌ను కూడా అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. నలుగురు మహిళలతో సహా ఏడుగురిని అరెస్టు చేశామని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.