వెంగళరావునగర్, ఆగస్టు 25: సీసీఎస్ పోలీసులమంటూ ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడిని బెదిరించి.. రూ.20 వేలు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు సెంట్రల్ జోన్ పోలీస్ ఉన్నతాధికారి వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం..అమీర్‌పేట ఆదిత్యా ఎన్‌క్లేవ్‌లోని అన్నపూర్ణ బ్లాక్‌లో 106వ నంబర్ ఫ్లాట్‌లో నూకల రమేశ్‌బాబు ఫస్ట్ స్టోన్ టెక్నాలజీస్ పేరిట సాఫ్ట్వేర్ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈనెల 21న మధ్యాహ్నం ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తనకు తాను రమేశ్గా పరిచయం చేసుకున్నాడు. 2017లో బీటెక్ పూర్తి చేశానని, తనకు సాఫ్ట్వేర్ కోర్సులో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరాడు.
దీంతో అతడిని 23న రమ్మని రమేశ్‌బాబు సూచించాడు. చెప్పిన రోజు వచ్చిన రమేశ్.. నిర్వాహకుడు రమేశ్‌బాబుతో మాట్లాడుతుండగానే మరో ఇద్దరు వ్యక్తులు రంగప్రవేశం చేశారు. అందులో ఒకరు పోలీస్ మాదిరిగా సఫారీ సూట్ వేసుకుని, చేతిలో వాకిటాకి పట్టుకున్నాడు. ఇద్దరు రాగానే రమేశ్ వారితో కలిసి రమేశ్‌బాబును బెదిరించారు. తాము సీసీఎస్ పోలీసులమని భయపెట్టారు. ఎటువంటి అనుమతి లేకుండా సాఫ్ట్వేర్ సంస్థ ఎలా నిర్వహిస్తున్నావని బెదిరించడమే కాకుండా అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడుతామని హెచ్చరించారు. రూ.2లక్షల ఇస్తే తాము వెళ్లిపోతామని బేరం పెట్టారు. భయపడిన రమేశ్‌బాబు రూ.20 వేలు ఇచ్చాడు. వారు వెళ్లిపోయిన అనంతరం అనుమానంతో ఆరా తీయగా, వచ్చిన వారు నకిలీ సీసీఎస్ పోలీసులని గుర్తించాడు. రమేశ్గా వచ్చింది భరత్ కాగా..మరో ఇద్దరు విక్రం, సాయికృష్ణలని తెలుసుకుని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఒకరైన విక్రమ్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.