బంజారాహిల్స్, ఆగస్టు 17: “నేను ఖమ్మం సీఐ దామోదర్‌ను. భార్యను హత్య చేసేందుకు నీవు సుపారీ ఇచ్చిన మహేశ్ మా అదుపులో ఉన్నాడు. నువ్వు మాట్లాడిన ఫోన్ రికార్డులు బయటపడకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలి” అంటూ ఓ వైద్యుడిని బెదిరించిన ఒకరిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నివాసం ఉంటున్న డాక్టర్ వి.కృష్ణప్రసాద్ వద్ద 2017లో మహేష్ అనే వ్యక్తి డ్రైవర్‌గా చేరాడు. ఇంటి పనుల్లోనూ సాయం చేస్తూ మంచిపేరు సంపాదించుకున్నాడు. దీంతో అతడికి కృష్ణప్రసాద్ సుమారు 20 లక్షల దాకా స్థలం కొనేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అనవసర విషయాలు చెబుతూ కృష్ణప్రసాద్, ఆయన భార్య మధ్య గొడవలు పెట్టిన మహేష్‌ను ఏడాది తర్వాత పని నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా ఈ నెల 14న ఓ వ్యక్తి డాక్టర్ కృష్ణప్రసాద్‌కు ఫోన్ చేశాడు. తాను ఖమ్మం సీఐ దామోదర్ అని.. మాట్లాడే పని ఉందంటూ ఆయన పనిచేస్తున్న ఆస్పత్రికి వచ్చాడు. “మీ వద్ద పని చేసిన మహేశ్ ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడని.. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా కొన్ని కాల్ రికార్డింగ్‌లు దొరికాయని వాటిలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయంటూ నమ్మబలికాడు. అవి బహిర్గతం కావద్దంటే ఆగస్టు 17 లోగా రూ.20 లక్షలు ఇవ్వాలని.. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతానని” బెదిరించి వెళ్లిపోయాడు.
ఖమ్మం సీఐని అంటూ బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం డబ్బులు సిద్ధంగా ఉన్నాయని డాక్టర్ కృష్ణప్రసాద్ ఫోన్ చేయగా.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని జగన్నాథ ఆలయం వద్దకు పోలీస్ స్టిక్కర్‌తో ఉన్న మహేంద్ర జైలో వాహనంలో నిందితుడు వచ్చాడు. వెంటనే డాక్టర్ కృష్ణప్రసాద్ అతడి వద్దకు వెళ్లి తన కారులో డబ్బులు ఉన్నాయని తీసుకునేందుకు రావాలని కోరాడు. దీంతో కారులోని డబ్బులు తీసుకునేందుకు రాగా అక్కడే మఫ్టీలో ఉన్న ఎస్సై కె. ఉదయ్ తన సిబ్బందితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం విచారణ చేయగా నిందితుడు విశాఖకు చెందిన గౌతంనాయర్(31)గా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహేశ్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.