కంటోన్మెంట్, జూన్ 27: నగరంలో వివిధ ప్రాంతాల్లో నిషేధిత గుట్కాలు, నకిలీ సిగరెట్లతో పాటు ఇతర మత్తుపదార్థాలు ( తంబాకు వస్తువులు) విక్రయిస్తున్న ముఠా సభ్యులను నార్త్ జోన్ టాస్క్ఫోర్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.6,13,410 లక్షల విలువజేసే నిషేధిత గుట్కాలు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకొని బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా డివిజన్, నాగలాపూర్ గ్రామానికి చెందిన కత్తి మల్లికార్జున్.. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ సమీపంలో అప్పా హోటల్, టీ స్టాల్లను నడుపుతున్నాడు. ఇందులో నిషేధిత గుట్కాలు, నకిలీ సిగరెట్లతో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తున్నాడు.
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలో పోలీసుల బృందం శనివారం అప్పా హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. నిషేధిత గుట్కాలు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిషేధిత గుట్కా విక్రయాల ముఠా గుట్టు బయటపడింది. రాజస్థాన్ రాష్ట్రం, పాలి జిల్లాకు చెందిన దినేశ్‌కుమార్ జగద్గిరిగుట్టలో ఉంటూ.. ఇతర రాష్ర్టాల నుంచి గుట్కాలు, నకిలీ సిగరెట్లు, మత్తు పదార్థాలను తీసుకొచ్చి.. బోయిన్పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, మార్కెట్, లాలాగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు దుకాణాలు, పాన్‌షాపుల్లో విక్రయిస్తున్నాడు.
ఇందుకు బంధువులైన రాజస్థాన్ పాలిజిల్లాకు చెందిన సురేశ్రామ్, సీతారామ్‌లను తీసుకొచ్చి విక్రయాలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి మల్లికార్జున్ గుట్కాలను కొనుగోలుచేసి విక్రయిస్తున్నాడని తేలింది. దీంతో పోలీసులు సురేశ్రామ్, సీతారామ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 6,13,410లక్షల విలువజేసే నిషేధిత గుట్కా, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను బోయిన్పల్లి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు దినేశ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.