సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రాత్రి పూట చల్లటి గాలులు.. మరోవైపు పగటివేళ భానుడి ప్రతాపం.. గత రెండు, మూడు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి. అప్పుడే ఎండాకాలం వచ్చినట్లుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలో శనివారం అత్యధిక కరెంటు వినియోగం నమోదు కాగా.. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే వినియోగం 20 శాతం పెరిగింది. ఫిబ్రవరి రెండో వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఈసారి వేసవిలో వినియోగం ఏకంగా 8 కోట్ల యూనిట్లకు చేరుకోనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇంత భారీస్థాయి వినియోగం ఉంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో మండు వేసవిలోనూ 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ రోజుల్లో కరెంటు వినియోగం 4 నుంచి 4.5 కోట్ల యూనిట్ల వరకు ఉంటుంది. గతంలోని వివరాలను పరిశీలిస్తే.. మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం 34.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. శనివారం అంతకుమించి ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఏడాదిలోనే శనివారం అత్యధిక కరెంటు వినియోగం నమోదైంది.
శనివారం గరిష్ఠంగా 5.4 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగంగా రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి దృష్ట్యా ఈ డిమాండు కొనసాగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. శనివారం తెలంగాణ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం నమోదైంది. అయితే గ్రేటర్ అవతల గృహ వినియోగంతో పాటు ప్రధానంగా వ్యవసాయ కరెంటు వినియోగం కూడా తోడైంది. కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం శనివారం సాధారణ వినియోగంతో పాటు గృహ వినియోగమే ఎక్కువైనట్లుగా తెలుస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణంగా స్పష్టమవుతుంది.
సెలవు దినం కావడంతోనే..!
శనివారం వీకెండ్ కావడంతో పాటు సెలవు దినం. దీంతో ఐటీ రంగానికి సెలవు. పైగా రాష్ట్ర రాజధాని కావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భారీగానే విద్యుత్ వినియోగం ఉంటుంది. రెండో శనివారం సెలవు దినం కావడంతో కార్యాలయాలు కూడా నడువలేదు. దీంతో కొంతమేర వినియోగం తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఈ ఏడాదిలోనే అత్యధిక వినియోగం నమోదైందంటే.. ఒకవేళ సెలవు దినం కాకపోతే 5.4 కోట్ల యూనిట్లకు మించి నమోదయ్యేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న వేసవిలో భారీ డిమాండు ఉండే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. గత వేసవిలో గరిష్ఠ వినియోగం 7.8 కోట్ల యూనిట్లుగా నమోదైంది. ఈసారి అది 8 కోట్ల యూనిట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతస్థాయి వినియోగం ఉన్నా.. కరెంటు సరఫరాలో మాత్రం కించిత్తు కోతలు, అంతరాయం ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.