సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసే పటాకుల దుకాణాలకు సంబంధించి తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి క్రాకర్స్ వ్యాపారులకు సూచించారు. అనుమతి లేకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని, దుకాణం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తే జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందాలని, ప్రైవేటు స్థలంలో అయితే సంబంధిత యజమాని నుంచి ఎన్ఓసీతో పాటు గతేడాది తీసుకున్న అనుమతి పత్రం, ఏర్పాటు చేయబోయే దుకాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ తదితర డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తు, రూ.600 చలాన చెల్లించిన రసీదును సంబంధిత జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో నేరుగా దాఖలు చేయాలని సూచించారు.