నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఐబొమ్మ రవి పోలీసు కస్టడీపై నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నంబర్ అయిన తర్వాత మంగళవారం జిల్లా కోర్టు జడ్జి సురేష్ విచారణ చేపట్టనున్నారు. నిందితుడి తరఫు న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని తద్వారా కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది. నిందితుడి తరఫు న్యాయవాది నోటీసులు అందిన వెంటనే కౌంటర్ దాఖలు చేసి కోర్టుకు వాదనలు వినిపిస్తారు.
మూడు కేసుల్లో ఒక్కోరోజు చొప్పున పోలీసు కస్టడీకి అప్పగిస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుపై అధికారులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఒక్కో కేసుకు 5రోజుల చొప్పున నాలుగు కేసుల్లో పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. కుబేర, కిష్కిందపురి, తండేల్, హిట్ సినిమాల పైరసీపై ఇచ్చిన ఫిర్యాదుల పట్ల నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు. మొత్తం 5 కేసుల్లో ప్రధాన నిందితుడిగా రవిని చేర్చగా, నాలుగు కేసుల్లో పూర్తి సమాచారం చేకరించేందుకు అధిక సమయం కావాలని తెలిపారు.
ఫిలీం చాంబర్స్ ఆఫ్ కామర్స్ హెడ్ యార్ర మనీంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో మాత్రమే రెండుసార్లు 8 రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టినట్టు వివరించారు. నాలుగు కేసుల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించి సాక్ష్యాధారాల్ని కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న రవిని పీటీ వారెంట్‌పై నాలుగు కేసుల్లో అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీ వ్యవహారం పూర్తయిన తర్వాతే బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి.