చర్లపల్లి, మే 9: ఖైదీల్లో శారీరక సామర్థ్యంతో పాటు మానసికోల్లాసాన్ని నింపేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలంగాణ రాష్ట్ర హోం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఐపీఎస్ రవిగుప్తా పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీల వార్షిక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు -2025ను ఆయన జైళ్ల శాఖ డీజీ, ఐపీఎస్ డాక్టర్ సౌమ్యమిశ్రా, జైలు ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి హర్షణీయమని, ముఖ్యంగా నాలుగు ప్లాట్‌ఫాంలుగా విభజించి ఒక్కొక్క బ్యాచ్‌లో 55మందిని కేటాయించి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జైళ్ల శాఖ డీజీ, ఐపీఎస్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైలులో ఖైదీలకు సౌకర్యాలు కల్పించడంతోపాటు వారి సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా క్రీడాజ్యోతిని వారు ఖైదీలకు అందజేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర కారాగారంలోని వివిధ పరిశ్రమల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, పండిస్తున్న పంటలు, భోజనశాల, వైద్యశాలతో పాటు వివిధ బ్యారక్‌లను సందర్శించి.. జైలు అధికారులు, సిబ్బంది పనితీరును వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు రాజేశ్, మురళీబాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్, వ్యవసాయక్షేత్రం సూపరింటెండెంట్ కళాసాగర్లతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జైలర్లు, డిప్యూటీ జైలర్లు, వార్డెన్లు, ఖైదీలు, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.