సిటీ బ్యూరో, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో వార్షిక నివేదిక సిద్ధం చేయడానికి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర కార్యాలయంలోని కొంత మంది సిబ్బంది ఏడాదిలో జరిగిన కార్యక్రమాలు, పురోగతిపై వివరాలు ఇవ్వడానికి మొండికేస్తున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఏడాది కాలంలో టాస్క్ఫోర్స్ తనిఖీలు, మూసివేసిన కాలుష్యకారక కంపెనీల వివరాలు, నీరు, నేల శాంపిళ్ల వివరాలు, చేపట్టిన పరీక్షల నివేదికలు, కాలుష్య కారక కంపెనీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా సంబంధిత విభాగాల్లోని వివరాలను ఇవ్వకుండా ఈఈడబ్ల్యూ అండ్ పీఆర్ సిబ్బందిని రోజుల తరబడిగా తిప్పించుకుంటున్నారు.
2024-25 ఏడాది పూర్తయినా దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో పూర్తి అలసత్వం వహిస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే గతనెల జరిగిన బోర్డు మీటింగ్లో వార్షిక నివేదికను సమర్పించలేదని తెలుస్తున్నది. ఏడాదిలో ఆయా విభాగాల్లో జరిగిన పనుల వివరాలను ఇవ్వకపోగా ఈఈడబ్ల్యూ నిర్లక్ష్యం వల్లనే నివేదిక అందలేదనే ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. వార్షిక నివేదికను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని మెంబర్ సెక్రటరీ సహా ఉన్నతాధికారులు పలుమార్లు ఆదేశించినా బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో కూడా అలసత్వం వహించడమేంటని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వార్షిక వివరాలు సమర్పించడంలో కాలుష్య నియంత్రణ మండలిలోని ఇంజినీరింగ్ విభాగ అధికారులు తీవ్రమైన జా ప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెలల తరబడిగా వివరాలు ఇవ్వకుండా మెంబర్ సెక్రటరీ, సంబంధిత ఉన్నతాధికారులు తమకు వివరాలు ఇవ్వాల్సిందిగా చెప్పలేదని ఈఈడబ్ల్యూ అధికారులతో చెప్తున్నట్లు తెలుస్తున్నది. ఏడాది కాలంలో ఆ విభాగంలో జరిగిన కార్యక్రమాల వివరాలివ్వడానికి కుంటిసాకులు చెబుతూ సమయం వృథా చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయానికి రావ డం, వెళ్లడమే పనిగా పెట్టుకుని పని మీద శ్రద్ధ పెట్టకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తున్నది.
దీనికితోడు సిబ్బంది కొరత ఉన్నది.. ఉన్న కొద్దిమందితో పనులన్నీ ఎలా చేయాలని ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరిస్తున్నా దిగువ స్థాయి వారు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. తమ పని తాము చేయకుండా ఉన్నతాధికారు ల పేర్లు చెబుతూ వార్షిక నివేదిక రూ పకల్పనలో మరింత ఆలస్యం చేయడం తగదని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఎవరిపని వారు చేస్తే ఆలస్యం జరగదని చెబుతున్నారు.