రవీంద్రభారతి, మే12: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 617వ జయంతి ఉత్సవాలు శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలుగుపాటకు, వచన కవిత్వ వైభవానికి అన్నమయ్య పాత్ర ఎనలేనిదని వక్తలు కొనియాడారు. ముఖ్య అతిథులుగా శాంతా బయోటిక్ అధినేత పద్మభూషణ్ డా.కేఐ వరప్రసాద్‌రెడ్డి, వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి హాజరయ్యారు.
అనంతరం ‘శ్రీ రామాభిరాం, రాజీవ నేత్రాయ రాఘవాయ’ వ్యాఖ్యాన గ్రంథాలను ఆవిష్కరించారు. వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. దాక్షిణాత్య ప్రపథమ వాగ్గేయకారుడైన అన్నమయ్య సంకీర్తనల సాహితి విలువలను జనబాహుళ్యంలోనికి తీసుకువెళ్లడానికి వెంకట్ గరికపాటి చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. మరోక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పీ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. అద్భుతమైన అన్నమయ్య సంకీర్తనల సారాన్ని పంచుతున్న వెంకట్ గరికపాటి ధన్యజీవి అని, తమ బ్యాంకులో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, బహుళ సంఖ్యలో గ్రంథాలను రాయడం గర్వకారణమైన విషయమన్నారు.
సభాధ్యక్షత వహించిన ప్రముఖ భాషావేత్త, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు డా.ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. అన్నమయ్య అపూరూపమైన సంకీర్తనలను స్పజించి, వాటిని తెలుగు వారికి వారసత్వ సంపదగా ప్రసాదించారని తెలిపారు. తాళ్లపాక పద సాహిత్య విశ్లేషకుడు వెంకట్ గరికపాటి ఆధ్వర్యంలోవిఖ్యాత సంగీత దర్శకులు శ్రీ రామాచారి బృందంచే అన్నమయ్య సంకర్తీన వైజయంతి పేరిట జరిగిన వ్యాఖ్యాన సహిత బృందగాన గాత్ర గోష్టి రసజ్ఞ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యువ గాయనీగాయకులు శ్రీమన్నారాణ (బౌళి) జగతి వైశాఖ శుద్ద చతుర్ధశి(బౌళి) ఆడరో పాడరో అప్పరో గణము (రామక్రియ) వంటి సంకీర్తనలను మధురాతి మధురంగా ఆలపించారు. ప్రతి సంకీర్తనకు వెంకట్ గరికపాటి ఈన విపుల విశ్లేషణను అందించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్, శ్రీరామ సంస్థ స్థాపన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.