మరమ్మతులు చేయించకుంటే ప్రమాదమే..
Anganwadi Centre | తుర్కయంజాల్, ఆగస్టు 30 : చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శిథిల భవనాల్లో చిన్నారులను ఉంచడం వలన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్న అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనాల మరమ్మతులతో పాటు నూతన భవనాల నిర్మాణం కోరకు ప్రభుత్వం నుంచి సకాలంలో నిధుల అందకపోవడంతో పలు అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి చిన్నారులను పంపించడానికి భయాందోళనకు గురి అవుతున్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడలోని అంగన్వాడీ కేంద్రం సొంత భవనంలో ఉన్నప్పటికి దాని నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సుమారు 10 మందికి పైగా చిన్నారులు వచ్చే అంగన్వాడీ కేంద్రంలో స్లాబ్ పెచ్చులుడుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వర్షాకాలంలో స్లాబ్ నుంచి నీళ్లు సైతం అంగన్వాడీ కేంద్రంలోకి వస్తున్నాయని పలు చోట్ల స్లాబ్ నుంచి పెచ్చులుడుతున్నాయని అంగన్వాడీ కేంద్రం టిచర్ నాగరాణి తెలిపారు. అంతేగాక డ్రైనేజీ సమస్య కూడా ఉందని డ్రైనేజీ సమస్యతో అంగన్వాడీ కేంద్రంలో దుర్గంధం వాసన వస్తుందని అన్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోని వెళ్లిన సమస్యను పరిష్కరించం లేదని అంగన్వాడీ కేంద్రం టీచర్ వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోని అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులు చేయించాలని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదం జరిగే వరకు చూడకుండా ముందే చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.