సిటీబ్యూరో: నిరసనలు, అభ్యంతరాల నడుమ జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చారు. నాలుగు గోడల మధ్య కూర్చొని కంప్యూటర్లో గూగుల్ మ్యాపులను చూసి ప్రధాన రహదారులే హద్దులుగా జీహెచ్ఎంసీ అధికారులు గీతలతో చుట్టేశారు.. సర్కారు పెద్దలను సంతృప్తిపరిచేలా అడ్డగోలుగా 300 డివిజన్లుగా ఖరారు చేశారు. ఒక్కో డివిజన్ ఒక్కో రీతిలో అన్నట్టు జనాభా భారీ వ్యత్యాసంతో కొత్త డివిజన్లను పుట్టించారు. మొక్కుబడిగా తంతుగా డివిజన్ల జనాభా, మ్యాపుల ప్రదర్శన లేకుండా అభ్యంతరాల స్వీకరణ తంతును ముగించారు. తమ వార్డులు గల్లంతయ్యాయని, తమ ఓటు బ్యాంకు ఇతర వార్డులోకి పోయిందంటూ..అన్ని వర్గాలు ముక్తకంఠంతో వార్డుల పునర్విభజనను వ్యతిరేకించినా..పలువురు న్యాయస్థానం మెట్లు ఎక్కినా ప్రజాభిప్రాయం అక్కర్లేదు ..యాక్ట్ ప్రకారమే నడుస్తున్నామంటూ ఏకపక్షంగా వ్యవహరించి వార్డుల పునర్విభజనను తుది దశకు చేర్చారు.
అయితే కుప్పలు తెప్పలుగా వచ్చిన అభ్యంతరాల పరిష్కారంలోనూ అధికారులు మమ అనిపించినట్లు తెలుస్తున్నది. డివిజన్ల పునర్విభజనపై జీహెచ్ఎంసీకి 5,973 ఫిర్యాదులు రాగా,. పేర్ల మార్పు, హద్దుల మార్పునకు సంబంధించినవి అధికారంగా ఉన్నాయి. అధికారులు మాత్రం సుమారు 40 డివిజన్ల పేర్లను మార్చామని 10కి పైగా డివిజన్ల హద్దులు స్వల్పంగా మార్చి నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. నేడు లేదా రేపు ఫైనల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.
నేడు తుది నోటిఫికేషన్… అనంతరం రిజర్వేషన్లు
ఫైనల్ నోటిఫికేషన్‌ను కమిషనర్ నేడు లేదా రేపు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. వార్డుల వారీగా ఉన్న జనాభా లెకల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లపై కూడా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిషరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాతే 300 వార్డులకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
పౌర సేవలకు బ్రేక్
మేడ్చల్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో విలీనమైన మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పౌర సేవలకు బ్రేక్ పడుతున్నది. జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమైన నాటి నుంచి ఎలాంటి పనులు జరగక ప్రజలు తిప్పలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ యాప్ లాగిన్ కాకపోవడంతో పౌర సేవలు ప్రజలకు అందడం లేదు. పౌరసేవలకు సంబంధించిన సర్వర్ల లాగిన్ సేవలు ఇంకా విలీన మున్సిపాలిటీలకు కేటాయించకపోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ప్రజలు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ యాప్ సమస్యతో వివిధ ధ్రువీకరణ పత్రాలకు లాగిన్ కాకపోవడంతో పత్రాలు అందక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా తమ ఆస్తులు తమ పేరిట మార్చుకునేందుకు మ్యుటేషన్లు కావడం లేదు. ఆస్తి పన్నులు చెల్లించలేకపోతున్నారు. మరణ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేయలేకపోతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణాల అనుమతులు పొందలేక పోతున్నారు. ఇలాంటి అనేక ఎమర్జెన్సీ పనులకు దరఖాస్తులు చేయాలంటే లాగిన్ కావడం లేదు. ఈ విషయమై ఇక్కడ విధులు నిర్వహించే అధికారులు మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు వివరించామని సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతాయని చేపుతున్న అచరణలో మాత్రం చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
కళ తప్పిన కొత్త సర్కిల్ కార్యాలయాలు
బడంగ్‌పేట: మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని సర్కిల్ కార్యాలయాలు కళ తప్పాయి. నిత్యం జనంతో సందడిగా ఉండే కార్యాలయాలు బోసిపోయాయి. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లు, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు కళ కళలాడిన కార్యాలయాలు ప్రస్తుతం ఎవరూ రాక పోవడంతో వెలవెలబోతున్నాయి. జీహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత పాలనపరమైన విధి విధానాలు రాకపోవడంతో అధికారులకు, సిబ్బందికి పనిలేకుండా పోయింది. కార్యాలయాలకు వచ్చి కొందరు సంతకాలు పెట్టి పోతే మరికొందరు సిబ్బంది కంప్యూటర్లలో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు కంప్యూటర్లు, సెల్ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. కొన్ని విభాగాల్లో సిబ్బంది లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో అధికారులు అన్ని విభాగాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఏ పనిచేయాలన్నా బల్దియా నుంచి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బల్దియా నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వచ్చిన జనాలకు ఏం చెప్పలేక అధికారులు, సిబ్బంది ముఖం చాటేస్తున్నారు. కాగా, బడంగ్‌పేట, మీర్‌పేట సర్కిల్ కార్యాలయాల్లో కూర్చొని చేసేదీ ఏమి లేక అధికారులు ఆటలకు శ్రీకారం చుట్టారు. బాలాపూర్‌లో ఉన్న కేఎల్ఆర్ గ్రౌండ్లో మీర్‌పేట, బడంగ్‌పేట డిప్యూటీ కమిషన్లు, మేనేజర్లు, అధికారులు, సిబ్బంది ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడారు.
అభ్యంతరాలన్నీ బుట్టదాఖలు
వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగాయంటూ అటు రాజకీయ పార్టీలు, ఇటు కాలనీ అసోసియేషన్లు, ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కాలనీల సంఘాల అసోసియేషన్ల సభ్యులు, ఆయా పార్టీల నేతలు తమ వార్డుల పేర్లపై, అసంతృప్తిని ఉన్నారు. ఉదాహరణకు చర్లపల్లి డివిజన్‌ను విభజించి కొత్తగా ఏర్పడిన వార్డుకు చక్రిపురం అని పేరు పెట్టారు. ఆది కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా కుషాయిగూడ పేరు పెట్టాలంటూ స్థానికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కాగా, 5,973 అభ్యంతరాల పరిష్కారానికి గడిచిన నాలుగు రోజులుగా ప్రత్యేక కమిటీ చర్యలు చేపట్టింది. సరిహద్దులు, పేర్ల మార్పులు, ఇతరత్రా నిర్ణయాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర కార్యాలయ స్థాయిలో ఉన్నతాధికారులతో కమిటీ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించినట్లు ప్రకటించారు. చాలా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
వంటా వార్పుతో నిరసన

తుర్కయాంజాల్, డిసెంబర్ 21: తుర్కయంజాల్ సర్కిల్లోని 53వ డివిజన్‌కు కొహెడ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుర్కయాంజాల్ సర్కిల్ పరిధి ఈదమ్మ గుడి వద్ద కోహెడ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తుర్కయాంజాల్ సర్కిల్‌ను రెండు డివిజన్లుగా విభజించి అధికారులు సరైన పద్ధతిలో విభజన చేయలేదన్నారు. 53వ డివిజన్‌కు కొహెడ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. కొహెడ జేఏసీ నిరాహార దీక్షకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంఘీభావం తెలిపారు. కొహెడ జేఏసీ నాయకులు కందాళ బలదేవారెడ్డి, బిందు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముదిరిన చర్లపల్లి పునర్విభజన లొల్లి

చర్లపల్లి, డిసెంబర్ 21: చర్లపల్లి డివిజన్ పునర్విభజనలో తలెత్తిన వివాదం ముదిరి ముదిరి తారా స్థాయికి చేరుకున్నది. కుషాయిగూడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి వ్యతిరేకంగా చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డి నిరసన తెలిపారు. తొలుత కుషాయిగూడ బస్టాప్‌లోని హనుమాన్ విగ్రహం ఎదురుగా పసుపు నీటితో స్నానం చేసి గతంలో ఆలయ నిర్మాణానికి ఇచ్చిన చెల్లని చెక్కును ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, పలు కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో కలిసి ఆయన కుషాయిగూడ పద్మావతీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపెల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ పునర్విభజనలో చక్రీపురం డివిజన్ కాకుండా కుషాయిగూడ పేరుతో డివిజన్ ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ధర్నాలు, నిరసనలు చేశారని, దీంతో అధికారులు స్థానికుల అభ్యర్థలను పరిగణనలోకి తీసుకొని కుషాయిగూడ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. కాగా, కుషాయిగూడ డివిజన్ ఏర్పాటుకు తానే కృషి చేశానని స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొనడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తమయ్యాయన్నారు.
కార్పొరేటర్, కొందరు నాయకులు తమపై వ్యతిరేకంగా సోషల్ మిడియాలో ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేయడంతో తాము ప్రకటనలను స్వీకరిస్తూ గుడిలో ప్రమాణం చేసేందుకు ర్యాలీ నిర్వహించామని, గంటల తరబడి గుడిలో వేచి ఉన్నా.. ఎవరూ రాకపోవడంతో అందోళన విరమించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, వివిధ పార్టీల నాయకులు గణేశ్ ముదిరాజ్, సారా అనిల్, గంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు.