సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అమెజాన్ కాల్‌సెంటర్ పేరుతో విదేశీయుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు యత్నించిన ఓ అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. బుధవారం మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సందీప్ వివరాలు వెల్లడించారు. వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌రెడ్డి యూకేలో కొంత కాలం కాల్సెంటర్లో పని చేశాడు. ఇతడితో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్, అమన్ కూడా అక్కడ కాల్సెంటర్లో పని చేశారు. కొన్ని రోజుల తరువాత ప్రమోద్‌రెడ్డి తిరిగి ఇండియాకు వచ్చి రాహుల్, అమన్, రామకృష్ణారెడ్డి, అజయ్‌కుమార్‌లతో కలిసి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో తమకు ఉన్న పరిజ్ఞానంతో విదేశీయుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించాలని పథకం వేశారు.
ఇందుకోసం పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన ఆకాశ్, వెస్లీల నుంచి 4ప్యాకేజీల ద్వారా మొత్తం 40వేల మంది కస్టమర్ల డేటాను నిందితులు కొనుగోలు చేశారు. ఈ విధంగా సేకరించిన డేటా ఆధారంగా నిందితులు ఆస్ట్రేలియా, కెనడా తదితర ప్రాంతాల్లోని కస్టమర్లకు ఫోన్ చేసి, తాము అమెజాన్ కస్టమర్ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలుకుతారు. ఇందుకోసం ఇంగ్లిష్ భాష మీద పట్టున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఖేశ్ రజాక్, కర్మషేపాల్, ఎండీ.ముస్తఫా తదితరులను సూపర్వైజర్లుగా నియమించి వారి ద్వారా కస్టమర్ల ఫోన్లు లేదా కంప్యూటర్లకు ‘ఎనీ డెస్క్’ యాప్‌ను పంపి, డౌన్లోడ్ చేసుకోమని చెబుతారు. యాప్‌ను కస్టమర్లు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వారి కంప్యూటర్ల లేదా ఫోన్లను నిందితులు తమ ఆధీనంలోకి తీసుకుని వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు.
ఆ తరువాత తాము లాగౌట్ అవుతున్నామని, మీ ఖాతాలో నుంచి కొంత నగదు డెబిట్ అవుతుందని, కొద్దిసేపట్లోనే రిటర్న్ చేస్తామని నమ్మిస్తారు. వెంటనే కస్టమర్ల ఖాతాలో నుంచి దొంగిలించిన డబ్బును ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ పేర్లమీద ఉన్న తమ బ్యాంక్ ఖాతాలోకి మార్చుకుంటారు. ఈ క్రమంలో నిందితులు మోసాలకు పాల్పడుతుండగా వెంటనే గమనించిన ఆస్ట్రేలియాలోని బ్యాంక్ అధికారులు సదరు మూడు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ప్రధాన నిందితులతో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకున్న మేడ్చల్ డీసీపీ సందీప్, ఎస్ఓటీ డీసీపీ ఎంఏ.రషీద్ బృందాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.