సుల్తాన్‌బజార్, ఆగస్టు 3 : మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీఎన్జీవో సంఘం సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉద్యోగులంతా ఉంటారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ ఆధ్వర్యంలో కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఉద్యోగుల సమస్యల పరిష్కార సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ సభ సమస్యల సభ కాకుండా.. విజయోత్సవ సభగా మారిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వీఆర్వోల సర్వీసును పునరుద్ధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అయినందునే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫిట్మెంట్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే పీఆర్సీ, డీఏ, ఐఆర్లను సైతం ప్రకటించబోతున్నారన్నారు. కొంత మంది కావాలనే టీఎన్జీవో సంఘంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారితో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జిల్లా శాఖ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ముజీబ్ హుస్సేనీ వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, సహ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం.సత్యనారాయణ గౌడ్, సభ్యులు మహ్మద్ నజీర్, కొండల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శైలజ, రంగారెడ్డి అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, 60 యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.