నేడు ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో

- పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా
- సుమారు 19 రాష్ర్టాల నుంచి నిర్వాహకులు రాక
సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : దేశ, విదేశీ ప్లాంట్స్..రంగురంగుల అరుదైన జాతుల పూలు.. స్వచ్ఛమైన గాలినిచ్చే మొక్కలు.. ఆరోగ్యాన్ని పంచే పండ్ల జాతుల విత్తనాలు... రసాయనాలు లేని కూరగాయల పెంపకానికి అవసరమయ్యే వస్తువులు.. వాటి అలంకరణకు ఉపయోగపడే సామగ్రి... మొక్కల పెంపకానికి వినియోగించే సాంకేతికత... వెరసి నెక్లెస్‌రోడ్డు పీపుల్ ప్లాజా వేదికగా ఉద్యాన ప్రదర్శన ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయనున్నది. నేడు తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభంకానున్నది. కొవిడ్ జాగ్రత్తల మధ్య ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోలో బెంగళూరు, కోల్కత్తా, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర సుమారు 19 రాష్ర్టాల నుంచి వ్యాపారులు పాల్గొంటారు. 120 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మేళాను సందర్శించవచ్చు.
నగరవాసుల ఆసక్తికి తగ్గట్టుగా..
ప్రతి ఏటా జరిగే ఈ మేళాలో నగరవాసులు అధిక సంఖ్యలో హాజరై తమకు నచ్చిన మొక్కలను కొనుగోలు చే స్తుంటారు. వారి ఆసక్తికి తగ్గట్టుగా ఈసారి అరుదైన మొక్కల జాతులు, నాణ్యమైన విత్తనాలు.. పెంపకంపై అవగాహన కల్పించే కార్యక్రమాలతో మేళా జరగనున్నది. ముఖ్యంగా మొక్కలు, కుండీలు, గార్డెనింగ్‌కు కావాల్సిన అన్ని రకాల వస్తువులతో నర్సరీ మేళా కనువిందు చేయనున్నది.
మేళా స్పెషల్..
లిలియాసిస్ (తులిప్స్, ఆంథ్యూరియం, లోటస్, లిల్లీ ఆఫ్ ది వాలే), కాక్టస్ సక్యూలెంట్స్(అలోవెర, క్రౌన్ ఆఫ్ థార్న్స్, ఫ్లేమింగ్ కెటీ, పాండా ప్లాంట్, రోసియం), బొన్సై(బోదీట్రీ, బాక్స్వుడ్, దానిమ్మ, కొటొనిస్టర్, జునిపర్), అడెనియం(ఒలిఫోలియం, సోకోట్రోనం, క్రిప్సం), ఇండోర్ అండ్ ఔట్‌డోర్ ప్లాంట్స్ (పార్లర్పామ్, రబ్బర్ ప్లాంట్, ఆఫ్రికన్ వయెలెట్, జడా ప్లాంట్), హై క్వాలిటీ ఫ్రూట్స్( జామ, కొకొనట్, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, పాపాయ, బనానా, స్ట్రాబెర్రీ)తో పాటు మెడిసినల్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయి.
నగరవాసులు మెచ్చేలా మేళా
నగరవాసులు మెచ్చేలా మేళా ఉంటుంది. మొక్కలు ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ సైన్స్, ఫుడ్ ఇండస్ట్రీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీని అందుబాటులో ఉంచుతున్నాం. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తమకు నచ్చిన సామగ్రిని నగరవాసులు కొనుగోలు చేయాలి. -ఖలీద్ అహ్మద్ జమీర్, తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్