ఒకవైపు వర్షాభావ పరిస్థితుల్లో ప్రజానీకం అల్లాడిపోతుంటే…మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ముసుగులో కొన్ని ఏజెన్సీలు అక్రమాల పర్వానికి తెరలేపాయి. వానలు రాకముందే నిధుల వరద పారించే క్రమంలో.. టెండర్ నిబంధనలను అడుగడుగునా తుంగలో తొక్కుతూ కొందరి అధికారుల అండదండలతో నెలరోజుల బిల్లులకు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. కేవలం కాగితాల్లో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని, క్షేత్రస్థాయిలో టెండర్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా… పేమెంట్ల వరకు మాన్సూన్ పనులు రావడం అటు బాధిత కాంట్రాక్టర్లు, ఇటు హైడ్రాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
సిటీబ్యూరో/మల్కాజ్గిరి, జూలై 16 (నమస్తే తెలంగాణ): వరద ముంపు నివారణ, అత్యవసర సహాయక చర్యలకుగానూ హైడ్రా గత నెల రెండవ వారంలో 62 చోట్ల ఎంఈటీ పనులకుగానూ దాదాపు రూ.85 కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. ఐతే సింహభాగం 40 సర్కిళ్ల పనులను 8 మంది ఏజెన్సీల గుప్పిట్లోకి వెళ్లిన టెండర్ తీరుపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, 62 టెండర్లకు సంబంధించి కాంట్రాక్టర్లతోఅగ్రిమెంట్లు పూర్తిస్థాయిలో కాలేదు..పైగా విధుల్లో ఏజెన్సీలు నిర్లక్ష్యం వహించాయంటూ నాలుగు చోట్ల పనులను రద్దుచేసి తిరిగి టెండర్లు పిలవగా…మళ్లీ ఇందులో ముగ్గురు పాతవారికే టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్, అడ్మిన్ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు-కాంట్రాక్టర్ల కుమ్మకుతో ప్రజాధనం వృథాకు ఆస్కారం ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతున్నది.
టెండర్ నిబంధన ప్రకారం వర్షాకాలం ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర బృందాలు నిరంతరం అందుబాటులో ఉండేలా 24 గంటల పాటు మూడు షిప్టుల్లో కార్మికులను రంగంలోకి దించాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పనులు దక్కించుకున్న కొందరు ఎజెన్సీలు ఒక్క షిఫ్ట్ మాత్రమే నడిపిస్తూ మిగిలిన రెండు షిప్టుల వేతనాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అన్నింటి కంటే మించి ప్రస్తుతం వర్షాలు లేవు..కాకపోతే ప్యాచ్‌వర్కు, నాలాల పరిశుభ్రత, ఇతర పనులకు ఈ ఎంఈటీ బృందాలను వినియోగించాల్సి ఉంటుంది…కానీ ఎంఈటీ బృందాలు నిరంతరం అందుబాటులో ఉన్నట్లు దాఖలాలు కనిపించడం లేదు… ఒక్క షిప్ట్ కార్మికులతోనే అదనపు గంటలు పనిచేయిస్తూ తీవ్ర శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారంటూ విమర్శలున్నాయి.
తాజాగా టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఎంఈటీ పనుల్లో మహిళలను రంగంలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదకర పనుల కోసం స్కిల్ లేబర్‌ను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ జిల్లెలగూడ ప్రాంతంలో మహిళా కార్మికుల చేత కూడా పనులు చేయించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు? వారి ఆరోగ్య పరిస్థితులు ఎంటీ? మూడు షిప్టుల్లో హాజరు శాతం ఎలా ఉంది? అనే కనీస సమాచారం హైడ్రా ఉన్నతాధికారులకు లేకపోవడం, పాలన పారదర్శకతకు అద్దం పడుతుందంటున్నారు.. రాష్ట్రంలోనే అత్యంత పారదర్శకంగా పనులు చేస్తుందని హైడ్రా పేరును చెప్పే ప్రభుత్వం, ఇంత దోపిడీ జరుగుతున్నా.. హైడ్రా స్పందించకపోవడం విడ్డూరం. మరి కొన్నిచోట్ల సామర్థ్యం లేని వాహనాలను సైతం వాడుతున్నట్లు తెలుస్తుంది. పూర్తి సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు పాటించని టెండర్లను రద్దుచేయాలని, ప్రజాధనం వృథాకాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
డిజిటల్ విప్లవానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తెలంగాణ రాజధానిలో హైడ్రా చుట్టూ సరికొత్త బిల్లింగ్ వివాదం ముసురుకుంటోంది. క్యూర్ అభివృద్ధిలో తమవంతు బాధ్యతగా శ్రమిస్తున్న కాంట్రాక్టర్ల పొట్టగొడుతూ ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు భగ్గుమంటున్నారు. సాధారణంగా టెండర్ తాలుకా బిల్లులను వర్క్ మేనేజ్మెంట్ సిస్టం (డబ్ల్యూఎంఎస్), ఆన్లైన్ ఈఆర్పీ పద్ధతిలో పేమెంట్లు జరుపుతూ పారదర్శకతను పాటిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ హైడ్రాలో మాత్రం అన్ని ప్రభుత్వ శాఖలకు విరుద్ధంగా మ్యానువల్ పద్దతిలో బిల్లులను మంజూరు చేస్తున్నది. జీహెచ్ఎంసీలో ట్రేడ్స్ విధానంలో నిర్వహణ బిల్లులు బ్యాంకుల ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు జరుగుతుంటే హైడ్రాలో డైరెక్ట్ చెక్కులు ఇస్తుండటతో.. లావాదేవీలపై జవాబుదారీతనం ఉండడం లేదని పలువురు కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
మాపై మున్సిపల్ అధికారులకు ఎలాంటి అధికారం లేదని, హైడ్రా అధికారులే చూస్తారని కొందరు కాంట్రాక్టర్లు బాహటంగానే చెబుతున్నారు. మూడు షిప్టులలో పనిచేసే సిబ్బంది ఒక్కో వార్డులో 12 మంది ఉండాల్సి ఉండగా 3 లేదా 4 గురు తోనే పనులు చేయిస్తున్న విషయం హైడ్రా అధికారులకు సైతం తెలిసినా చర్యలు తీసుకోకపోవడం మరింత అనుమానాలకు తావిస్తుంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం, సర్కిల్స్ పరిధిలో హైడ్రా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్లకు మరింతగా కలిసివస్తుంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ నుంచి హైడ్రాకు అప్పగిస్తే, పర్యవేక్షణలోపంతో కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కుతుండటం విశేషం.
ఈఆర్పీ విధానం అమల్లో ఉంటే ప్రతీబిల్లుకు ఈఆర్సీ నంబరు, ఆన్లైన్ ట్రాకింగ్ ఉండటం ద్వారా ఏకంగా పదేళ్ల తర్వాత కూడా రికార్డులు భద్రంగా ఉంటాయని చెబుతున్నారు. ఈఆర్సీ లేకపోతే మ్యానువల్ బిల్లింగ్‌లతో ఒకే పనికి రెండుసార్లు పేమెంట్లు చేయడం, డూప్లికేట్ బిల్లులు సృష్టించడం, రికార్డులను మాయం చేయడం వంటి అక్రమాలకు అస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే నిజాంపేట, బడంగ్‌పేట మున్సిపాలిటీలలో బిల్లుల గోల్‌మాల్‌తో ప్రజాధనం వృథా అయిందని, ఒకే ప్రభుత్వంలో రెండు నీతులు..ఒకరికి వెన్న..ఒకరికి సున్నం అన్న విధానం ఉండవద్దని, కేవలం కాగితాలపై మ్యాన్వల్ పాస్ ఆర్డర్ వేసి డైరెక్ట్ చెక్కులు (ఆర్టీజీఎస్) రాసే విధానానికి స్వస్తి పలకాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.