సిటీబ్యూరో, జూలై 19, (నమస్తే తెలంగాణ): తమకు కావాల్సిన భవనం కావాలంటే అందులోని వారిని పథకం వేసి వెల్లగొట్టాలన్నది ఉస్మానియా దవాఖానలోని పలువురి వైద్యాధికారుల అభిప్రాయం. దవాఖాన పద్దులు చూసే విభాగం ఉన్నతాధికారుల చెంత ఉంచాలన్న లక్ష్యంతో సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఉన్న నర్సింగ్ విద్యార్థినుల వసతి గృహాన్ని ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకే కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా ఇన్ని రోజులు వదిలేశారు.
తమ చాంబర్లకు మెరుగులద్దారు..
1951లో నిర్మించిన ఉస్మానియా నర్సింగ్ విద్యార్థినుల వసతి భవనం ప్రస్తుతమున్న మూడు బ్లాకుల్లో 180 మంది జనరల్ నర్సింగ్, 50 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు ఉంటూ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య శిక్షణ తీసుకుంటున్నారు. మూడు బ్లాకుల్లో కూడా పెచ్చులూడటం, కాలం చెల్లిన స్వీచ్బోర్డుల వైర్లు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఇందులో ఉండేవారిలో పేద విద్యార్థినులే అధికం. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం దాన్ని మరమ్మతులు చేయించకుండా వదిలేశారు. విద్యార్థినుల ఇబ్బందులు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.
మరమ్మతులు చేయాల్సింది పోయి విద్యారినులకు ఒక్కసారిగా భవనం నుంచి ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు. శిథిలాస్థకు చేరిందనే కారణంతో ఖాళీ చేసిన భవనంలో ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న విద్యార్థినుల వసతిగృహంలో మరమ్మతులు చేయాల్సినవి అనేకం ఉన్నాయి. కంపుకొట్టే మరుగుదొడ్లు, పెచ్చులూడుతున్న గదులు, ఊడిపడుతున్న తలుపులను మరమ్మతు చేయించకుండా వదిలేశారు.
ఇంతకంటే శిథిలాస్థలోకి నర్సింగ్ తరగతి గదులు చేరాయి.. కానీ అవి తమ అవసరాలకోసం రూ.లక్షలు పెట్టి బాగు చేసుకొని వైద్యాధికారులు చాంబర్లు ఏర్పాటు చేసుకున్నారు. తమ చాంబర్లు, ఇతర గదులు ఆధునీకరించుకున్న తరహాలో పేద విద్యార్థినులు ఉండే భవనాలకు మరమ్మతులు చేయించలేకపోవడం గమనార్హం. వసతి గృహాల మరమ్మతుల కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను పక్కదారి పట్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇబ్బందులు తప్పవు..
గోషామహల్ ప్రాంతంలో నిర్మించబోయే ఉస్మానియా దవాఖాన పనులు ప్రారంభమే కాలేదు. అది ప్రారంభమై పూర్తయ్యే సరికి చాలా ఏండ్లు పట్టే అవకాశం లేకపోలేదు. అప్పటివరకు ప్రస్తుతమున్న వసతి గృహాన్ని మరమ్మతులు చేయించడం అత్యంత అవసరం. లేదంటే జీఎన్ఎం విద్యార్థినులు గోషామహల్ నుంచి ప్రతి రోజూ రావాలంటే ఇబ్బందులు పడాల్సిందే. దీంతో పాటు షిప్ట్‌ల్లో పనిచేయడం, పాఠాలు వినడం, ప్రాక్టికల్స్ చేయడం వంటి విషయాల్లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. బయట వసతి గృహం ఏర్పాటు చేయడం మూలంగా ప్రధానంగా పర్యవేక్షణ లోపిస్తుందనే వాదన వినిపిస్తోంది.