సిటీబ్యూరో, ఆగస్ట్ 13 (నమస్తే తెలంగాణ): బదిలీ అయినా సీటు వదలడు.. ఆలయంలో వచ్చే వాటాలు వదులుకోడు. ఇక్కడైతే తన వాడే అధికారి.. తన సోదరుడే అర్చకుడు.. ఈ ఆలయమైతే ఎదురులేదని డిసైడయ్యాడు. సికింద్రాబాద్ నుంచి ఇక్కడకు వచ్చాడు. బోనాల సమయం, ఆ తర్వాత ముగ్గురూ కలిసి నిధుల స్వాహాకు పాల్పడ్డారని దేవాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీరిని ఎవరైనా ఏమైనా అంటే చాలు.. తిట్ల దండకం అందుకుంటారు. స్థానిక నేతలతో బెదిరిస్తారు. అవసరమైతే ప్రశ్నించినవారిపై దాడులకు కూడా వెనకాడరన్న ప్రచారం జరుగుతోంది. తమకు ఎదురు వస్తే సహించేది లేదంటూ ఆ ముగ్గురు ఆలయ అధికారితో కలిసి వాటాలు పంచుకోవడంపై దేవాదాయశాఖలో పెద్ద చర్చే జరుగుతోంది. ఏకంగా దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులనే ఆ అధికారి, ఉద్యోగి బేఖాతరు చేయడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆలయంలోనే కాదు తమ శాఖలోనే ఎదురులేదంటూ ఆ అధికారి, అర్చకుడు, సీనియర్ ఉద్యోగి చేసే ఆలయనిధుల స్వాహా కార్యం దేవాదాయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. బదిలీ అయినా సీటు వదలని ఆ సీనియర్ ఉద్యోగి ధైర్యమేంటని, అడిషనల్ కమిషనర్ ఉత్తర్వుల కంటే ఆ అధికారి తాను అనుకున్నదే చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. తనవెనక మంత్రి ఉన్నాడని, తనకు కమిషనర్ కూడా భయపడుతాడంటూ ఆ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం అమీర్‌పేట, బేగంపేట సమీపంలోని రెండు ఆలయాల్లోనూ చర్చిస్తున్నారు. ఏడిసి ఆర్డర్‌నే అడ్డుకుంటున్నారంటే ఆ అధికారి ఏస్థాయిలో
పైరవీలు చేస్తున్నాడో, ఆ సీనియర్ ఉద్యోగితో ఎందుకు అంటకాగుతున్నాడో అర్ధం
చేసుకోవచ్చని ఆలయ వర్గాలు, భక్తులు అనుకుంటున్నాయి.
ఈనెల 5వ తేదీన రెండు దేవాలయాలకు చెందిన ఇద్దరు ఉద్యోగులను సికింద్రాబాద్ అమ్మవారి ఆలయానికి సంవత్సరం పాటు డిప్యుటేషన్ కింద కేటాయిస్తూ దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో మరో సీనియర్ అసిస్టెంట్‌ను కూడా వేరే దేవాలయానికి బదిలీ చేయడంతో అమీర్‌పేట సమీపంలోని ఆ అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న మరో ఉద్యోగిని వెంటనే రిలీవ్ చేసిన అధికారి తన వర్గానికి చెందిన సీనియర్ ఉద్యోగిని మాత్రం బయటకు పంపలేదు. దీనిపై ఆలయ భక్తులు, దాతలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. ఆలయంలో నిధులు, బంగారం స్వాహా పర్వానికి తెరతీసిన అర్చకుడు, సీనియర్ ఉద్యోగి అండదండలతో ఈ అధికారి చెలరేగి పోతున్నారని, ఇప్పటికే లక్షలలక్షల రూపాయలు తనకు అధికారం లేకున్నా చెక్‌ల రూపంలో ఇస్తూ వారి దగ్గర కమిషన్లు నొక్కుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.
బదిలీ అయినా సీటు వదలని ఆ సీనియర్ ఉద్యోగికి అర్చకుడు సోదరుడు కావడంతో వారిద్దరూ కలిసి బంగారం విషయంలో ఆ అధికారితో కుమ్ముక్కై అమ్మవారి బంగారానికి ఎసరు పెడుతున్నారని దాతలు అంటున్నారు. ఏడిసి ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరచకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉంటూ ఎన్ని రకాల విమర్శలు వచ్చినా ఇంకా ఆలయంలో తిష్టవేసుకుని కూర్చుంటున్నారంటే ఆలయ నిధుల స్వాహాకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని, ఆలయ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలంటూ దేవాదాయశాఖకు భక్తులు ఇటీవల ఫిర్యాదు చేశారు. అసలు ఆ అధికారికి వెన్నుదన్నుగా ఉన్న ఇన్చార్జ్ మంత్రి ఆలయానికి పెద్ద దాతగా కాగా అమ్మవారి కోసం పనిచేయాల్సిన చోట అమ్మవారి సొమ్ముకే ఎసరుపెడుతున్న అధికారి, అర్చకుడు, సీనియర్ ఉద్యోగిని ఎలా కాపాడుతారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో అవినీతి అక్రమాల్లో పాలుపంచుకుంటూ అధికారం లేకున్నా లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్న ఆ అధికారికి దేవాదాయ ఉన్నతాధికారులు భయపడుతున్నారా అంటూ ఆశాఖలో చర్చించుకుంటున్నారు. ఏసి కేడర్ దేవాలయానికి అర్హత లేని అధికారిని వేయడమేకాకుండా అతని విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఆలయ అస్తిత్వానికే భంగం కలిగించేలా చేస్తున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడమేంటంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అర్హత లేని అర్చకుడిని కొనసాగిస్తూ దాతలు ఇచ్చిన బంగారం అతను ఆలయానికి ఇవ్వకపోయినా తన వర్గం వారిగా అర్చకుడిని, సీనియర్ ఉద్యోగి అక్రమాలకు వంత పాడుతూ వారి అవినీతి సొమ్ములో వాటాలు తింటున్న ఆ అధికారిని ఎలా ఉపేక్షిస్తారంటూ కొందరు దాతలు మండిపడుతున్నారు.
ఆలయంలోని అర్చకుడిపై ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో క్రిమినల్ కేసు ఉండి ఇంకా హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ అతనికి గర్భగుడిలో డ్యూటీలు వేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాడంటూ ఆ అధికారిపై దేవాలయంలోనే చర్చ జరుగుతోంది. అసలు అతను ఉండాల్సిన ఆలయం వేరే కాగా గతంలో పనిచేసిన ఓ మహిళా అధికారిని మేనేజ్ చేసి ఆమె హయాంలో గర్భగుడిలోకి వచ్చిన ఆ అర్చకుడిపై క్రిమినల్ కేసు ఉందని అతనిని గర్భగుడిలోకి ఎలా అనుమతిస్తారంటూ ఎన్నిసార్లు దేవాదాయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు ఆలయంలో ఎలాంటి అర్హతలు లేకుండా కొనసాగిస్తున్న వారిని అక్కడినుంచి పంపించేయాలని, క్రిమినల్ కేసు ఉన్న అర్చకుడిని గర్భగుడి వెలుపల డ్యూటీలు వేసి అమ్మవారి ఆభరణాలకు రక్షణ కల్పించాలని దాతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారి, అర్చకుడి వ్యవహారంపై ఏసిబికి కూడా ఫిర్యాదు చేస్తామని, ఇందులో ఎవరెవరు ఎంతెంత వాటాలు పంచుకుంటున్నారో నిగ్గు తేల్చి ఆలయ ఆదాయానికి గండికొడుతున్న వారిపై చర్యలు తీసుకునే వరకు తాము ఊరుకునేది లేదని భక్తులు తెలిపారు.