సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ ) : సూపర్‌మార్కెట్‌కు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త…నాసిరకం ఫుడ్ ప్యాకెట్లు, ఎక్స్పైరీ డేట్ దాటిన ఉత్పత్తులు కస్టమర్లకు అంటగడుతున్నారు. అన్నీ ఒకే చోట లభిస్తాయి కదా అని వెళ్లిన వినియోగదారుడి అవసరాన్ని ఆసరాగా చేసుకొని నాణ్యత లేని ఆహార పదార్థాలను అంటగడుతున్నారు. కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హాస్టళ్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టగా తాజాగా సూపర్ మార్కెట్లపై దృష్టి సారించారు. వనస్థలిపురం డీ మార్ట్‌లో స్పౌట్స్, బేబీ కార్న్, మష్రూమ్ వంటి న్యూట్రివాలా బ్రాండ్స్ గడువు తీరినట్లు గుర్తించారు.
తుర్కయాంజల్‌లోని బీ పార్టు (బాలాజీ మార్ట్ ఎంటర్ప్రైజెస్)లో ఐదు కిలోల రాగి పిండి, 208 కిలోల ఇడ్లీ రవ్వ, ఉరద్ గోటా 150 కిలోలను స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకున్నారు. మొత్తంగా సూపర్మార్కెట్లలో కొనుగోలు చేసే ప్యాకింగ్ వస్తువులను చూసి కొనాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లలో కల్తీ, నకిలీ వస్తువులు విరివిరిగా దొరుకుతున్నాయి.. తాగేనీరు, తినే పదార్థాల ప్యాకింగ్‌పై అవి తయారు చేసిన తేదీ, ఎప్పటి వరకు వాడొచ్చు, చిరునామా తదితర విషయాలను సరి చూసుకోవాలి. కొన్ని దుకాణాల్లో తేదీ దాటిన తర్వాత కూడా సంబంధిత వస్తువులను విక్రయిస్తుంటారు. అందువల్ల వినియోగదారుడు గమనించి కొంటే మంచిదని చెబుతున్నారు.