సుల్తాన్‌బజార్, అక్టోబర్ 26. మొబైల్ దొంగ అన్సారీపై చర్యలు తీసుకోవాలని సుల్తాన్‌బజార్ పీఎస్‌లో డీసీపీ చైతన్యకుమార్ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఛాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీస్ అధికారులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించి గాయాలపాలైన పాత నేరస్థుడు మహ్మద్ ఓమర్ అన్సారీకి ఆదివారం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న ఆటోడ్రైవర్‌తోపాటు మరో నిందితుడి కోసం 5 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు 248/2025 సెక్షన్ 304,109,బిఎన్ఎస్ 132 కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ నరసింహా పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఆధారాలు చెదరకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇసామియాబజార్ టెలివిజన్ గల్లీలోని నిందితుడు ఎక్కిన భవనాలు, ఆయా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల డీవీఆర్‌లను సేకరించి నిందితుల కదలికలపై ఆరా తీసేందుకు సీసీటీవీ ఫుటేజీ క్లిప్పులను సేకరిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు ఇన్స్పెక్టర్ నరసింహ కేసు వివరాలను వెల్లడిస్తూ శనివారం సాయంత్రం 4.45 గంటలకు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ తన అధికారిక వాహనంలో గన్‌మెన్ వీఎస్ఎన్ మూర్తి, డ్రైవర్ సందీప్‌తో బషీర్‌బాగ్‌లో అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం బషీర్‌బాగ్ నుండి తిరిగి వస్తుండగా కోఠి సమీపంలోని ఇసామియాబజార్ వద్దకు చేరుకోగానే అక్కడ డీసీపీ డ్రైవర్ సందీప్ ఆటో(9395)లో నుండి ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ లాక్కోవడం చూశానని డీసీపీకి తెలిపారు. దీంతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆటోను పట్టుకునే ఉద్ధేశ్యంతో ఆటోను అనుసరించమని డీసీపీ డ్రైవర్‌కు సూచించారు.
సుమారు 4.50 గంటలకు ఛాదర్‌ఘాట్ సిగ్నల్ సమీపంలోని ఇసామియా బజార్‌కు చేరుకోగానే మొబైల్ స్నాచర్లను పట్టుకోవాలని తన గన్‌మెన్ వీఎస్ఎన్ మూర్తిని డీసీపీ ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా స్నాచర్ల ఆటో నిలిచిపోయింది. గన్‌మెన్ మూర్తి ఆటోలోని ఓ వ్యక్తిని విజయవంతంగా పట్టుకున్నాడు. పోలీసులు ఒకరిని పట్టుకోవడం చూసిన మిగిలిన ఇద్దరు అక్కడి నుండి ఆటోలో పారిపోయారు. పట్టుబడిన నిందితుడు గన్‌మెన్ మూర్తిని బలవంతంగా తోసివేయడంతో రోడ్డుపై పడిపోయాడు. దీంతో స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రక్రియలో గన్‌మెన్ మూర్తి 9ఎంఎం పిస్టల్ నేలపై పడింది. సిగ్నల్ నుండి టెలివిజన్ గల్లీలోకి పారిపోతున్న మహ్మద్ ఓమర్ అన్సారీని వెంబడిస్తూ డీసీపీ, మూర్తి ఇద్దరు పరిగెత్తారు. ఇలా సుమారు 750 మీటర్ల మేర ఛేజ్ చేశారు. కాగా నిందితుడు ఓ లేన్‌లో ఎటూ వెళ్లడానికి దారిలేకపోవడంతో ఓ రెండస్థుల భవనం ఎక్కి పక్కనే ఉన్న మరో భవనం టెర్రస్‌పైకి దూకాడు. కాగా గన్‌మెన్ మూర్తి కూడా అదే టెర్రస్‌పైకి దూకి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా నిందితుడు మూర్తిపై కత్తితో దాడి చేసి చంపేందుకు యత్నించాడు. దీంతో మూర్తి.. సార్ ..సార్ అంటూ బిగ్గరగా అరిచాడు. దీంతో కత్తితో మూర్తిపైకి దూసుకొస్తున్న నిందితుడిపై డీసీపీ చైతన్య ఒక రౌండు భుజంపై కాల్పులు జరిపాడు.
అయినప్పటికీ మూర్తిపైకి మరోమారు దాడి చేసేందుకు వస్తుండగా రెండో రౌండ్ కడుపు భాగంలో కాల్పులు జరిపాడని ఆయన వివరించారు. ఇక తాను దాడి చేయలేనని గ్రహించిన నిందితుడు టెర్రస్ పైనుండి రోడ్డుపైకి దూకి విక్టోరియా ప్లే గ్రౌండ్ వైపు పారిపోయాడు. గ్రౌండ్ వద్ద నేరస్థుడిని మూర్తి కత్తి పడవేయాలని ఆదేశించాడు. డ్రైవర్ వెంటనే సమీపంలోని ఛాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన నేరస్థుడిని చికిత్స కోసం ఛాదర్‌ఘాట్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. పేరు మోసిన నేరస్థుడు మహమ్మద్ ఓమర్ అన్సారీ, అతని ఇద్దరు సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన వివరించారు.
డీసీపీ, గన్మెన్లకు డీజీపీ పరామర్శ
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : విక్టోరియా గ్రౌండ్లో సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో గాయపడి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న సౌత్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తిలను డీజీపీ శివధర్‌రెడ్డి, నగర కమిషనర్ వీసీ సజ్జనార్‌లు ఆదివారం పరామర్శించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో నిందితులు డీసీపీ, గన్మెన్లపై కత్తితో దాడికి పాల్పడ్డారని, ప్రధాన నిందితుడు ఓమర్ అన్సారీపై గతంలో 22 కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో ఓమర్ అన్సారిపై రౌడీషీట్ కూడా ఉందన్నారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. వారి వెంట వెస్ట్‌జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా ఉన్నారు.