సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం అమలుకు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇంతకాలం ఈ పథకానికి ప్రభుత్వం సహకరిస్తుందని భావించిన అధికారులకు సొంత నిధులను సమకూర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రుణాల వైపు కసరత్తు మొదలు పెట్టారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బల్దియాకు కొత్త ప్రాజెక్టులకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ప్రభుత్వ గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని భావిస్తున్నది.
ఇందులో భాగంగానే సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) రెండో దశలో భాగంగా నగరవ్యాప్తంగా వందల కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ, నూతన నిర్మాణాలకు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు రూ.3,145 కోట్ల భారీ వ్యయంతో కూడిన ప్రతిపాదనలపై నేడు (గురువారం) స్టాండింగ్ కమిటీ సమావేశంలో 35వ ఎజెండా అంశంగా చేర్చారు. గత ఏడాది ఆగస్టు, నవంబర్ నెలల్లో జరిగిన సమావేశాల్లో ఈ పనులపై ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనం తర్వాత పనుల పరిధిని పెంచడంతో పాటు సాంకేతిక మార్పుల దృష్ట్యా సవరించిన తాజా ప్రతిపాదనలపై సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
రహదారుల అభివృద్ధిని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. సీఆర్ఎంపీ రెండో దశ గతంలో మొదటి దశలో సంప్రదాయ పద్ధతిలో చేపట్టిన 744.22 కిలోమీటర్లలో పొడవైన బీటీ , సీసీ రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ కోసం అత్యధికంగా రూ. 2,230 కోట్లు అవసరమని అంచనా వేశారు. కొత్త సీసీ రహదారుల్లో భాగంగా మొదటి దశలో కవర్ కాని ప్రాంతాల్లో అదనంగా 64.49 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రహదారుల నిర్మాణానికి రూ. 208 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎఫ్డిఆర్ సాంకేతికతతో బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించారు. మొదటిసారిగా ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) అనే అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దీని ద్వారా 236.30 కిలోమీటర్ల మేర అదనపు బీటీ రహదారులను రూ. 707 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.
సాధారణంగా రోడ్ల మరమ్మతుల సమయంలో పాత పొరను తొలగించి కొత్తది మిల్లింగ్ వేస్తారు. అయితే ఎఫ్డీఆర్ సాం కేతికతలో పాత రోడ్డులోని పదార్థాలనే రసాయనాలు, సిమెంట్ కలిపి తిరిగి వినియోగిస్తారు. దీనివల్ల రోడ్డు దృఢంగా ఉండటమే కాకుండా వర్షపు నీటి వల్ల త్వ రగా దెబ్బతినదు. హెచ్ఆర్డీసిఎల్ ఇప్పటికే ఈ విధానాన్ని ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ నిపుణులు కూడా ఈ సాంకేతికతపై సానుకూల నివేదికలు అందించారు.