Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. icfai యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
icfai యూనివర్సిటీకి చెందిన హాస్టల్లో ఉంటున్న లేఖ్య అనే విద్యార్థిని.. ఎప్పటిలాగే ఇవాళ ఉదయం స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే స్నానం చేసే బకెట్లో అప్పటికే కొందరు ఆగంతకులు యాసిడ్ పోశారు. ఈ విషయం తెలియని లేఖ్య.. బకెట్లో ఉన్నవి నీళ్లే అనుకుని మగ్గుతో ముంచుకుని ఒంటిపై పోసుకుంది. ఒక్కసారిగా యాసిడ్ ఒంటి మీద పడటంతో భరించలేని మంటతో ఆ విద్యార్థిని గట్టిగా అరిచింది. విద్యార్థిని కేకలతో తోటి విద్యార్థినులు వాష్రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా.. అసలు విషయం తెలిసింది. దీంతో వాళ్లు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఒళ్లంతా గాయాలతో తల్లడిల్లిపోతున్న సదరు విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
యాసిడ్ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసలు విద్యార్థినిపై ఎవరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, యాసిడ్ దాడితో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడికి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.