నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో న మోదైన బాలికపై జరిగిన లైంగికదాడి కేసు లో ప్రధాన నిందితుడు సీనియర్ సిటిజన్ క్లారెన్స్ ఫ్రాన్సిస్(76)కు జీవిత ఖైదుగా, ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న పొ న్నాల ఆంజనేయులు అలియాస్ అంజీ (31)కు 20 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి టి.అనిత సోమవారం సంచలన తీర్పు వెల్లడించారు. నిందితులకు రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష ఉంటుందని తీర్పులో వెల్లడించారు.
బాధిత బాలికకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌రెడ్డి కథనం ప్రకారం.. బాలిక నివసిస్తున్న ఇంటికి పక్కన ఉంటున్న నిందితుడు ఫ్రాన్సిస్ క్యారమ్ ఆడేందుకు రమ్మని పిలిచి లైంగికంగా దాడికి పాల్పడినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అధికారి డి.భిక్షపతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ పి.దేవేందర్ సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులను సేకరించి చార్జీషీట్ దాఖలు చేశారు.
2021లో బంధువు అయిన రెండో ముద్దాయి అంజీ తన ఇంటికి వచ్చి నోరు మూసి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాల్ని ఎవరికీ తెలియజేయరాదని బాలికను భయపెట్టినట్టు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఆరు నెలల గర్భం దాల్చినట్టు వైద్యుల పరీక్షల ద్వారా బయటపడింది. అకస్మాత్తుగా బాలిక కడుపులో ఉన్న శిశువు చనిపోవడం జరిగిందని, ఆ శిశువును ఉస్మానియా మార్చురీకి తరలించి పోస్టుమార్టం రిపోర్టును పోలీసులు సేకరించారు. నిందితుల రక్తం నమూనాల్ని సేకరించి, గర్భస్త శిశువు రక్తం డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన ప్రత్యేక పోక్సో కోర్టు నిందితులు నేరం చేసినట్టు రుజువుకావడంతో శిక్షలు ఖరారు చేసింది. నిందితులకు యావజ్జీవ శిక్ష పడటంతో బాలిక కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.