నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నికేశ్‌కుమార్ నుంచి కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. అతని నుంచి ట్యాక్స్ రిటర్న్ పత్రాలను సైతం ఆధారాల కోసం తీసుకున్నారు. కస్టడీ సమయం ఒక్కరోజు మిగిలి ఉండగానే నిందితుడిని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు. నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు మూడు రోజుల్లోపే విచారణను పూర్తిచేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చి.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అక్రమాస్తుల సంపాదన కింద నమోదు చేసిన కేసులో నికేశ్‌కుమార్ రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో కొనసాగుతున్నారు.
మధ్యవర్తుల సమక్షంలో డాక్యుమెంట్లను, బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలకు చెందిన వివరాలను నిందితుడితోపాటు వారి కుటుంబ సభ్యులనుంచి కూడా తెలుసుకున్నారు. ఇప్పటివరకు అక్రమ సంపాదన కేసుల్లో దేవికారాణి ప్రథమ స్థానంలో ఉండగా, నికేశ్‌కుమార్ కేసు రెండో స్థానంలో నిలిచినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. తాండూరు స్వస్థలం, హైదరాబాద్‌లో నిందితుడి పేరిట, బంధువులపై బినామీ పేర్లమీద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2016నుంచి స్థిర, చరాస్తుల కొనుగోలుకు చెందిన కీలక పత్రాల ఆధారంగా వాటి విలువ లక్షలకుపైనేనని విచారణలో బయటపడ్డాయి.
బంగారు అభరణాలు : గోల్డ్ చైన్ (15గ్రా.), 11 ఫింగర్ రింగ్స్ (23గ్రా.), ఫింగర్ రింగ్ (5గ్రా), బ్రాస్లెట్ (4గ్రా), బ్లాక్ బీడ్స్ చైన్ (10గ్రా), బంగారు రూబీ స్టోన్ (5గ్రా), బంగారు వైట్ బీడ్స్ (5గ్రా), గోల్డ్ చైన్ లాకెట్ (4గ్రా), బ్యాంగిల్ పెయిర్ (5గ్రా), మూడు రింగులు (5గ్రా), బ్రాస్లెట్ (10గ్రా), మంగళ సూత్రాలు -2 (40గ్రా) బంగారు ఆభరణాల వివరాలను నికేశ్‌కుమార్ భార్య వీణాధారి తెలిపిన ప్రకారం ఏసీబీ అధికారు లు నమోదు చేసుకున్నారు. నిందితుడి తల్లి మహాలక్ష్మి సహాయంతో మాస్టర్ బెడ్రూంలో హెరూర్ కల్పన, హెరూర్ నికేశ్‌కుమార్, కె.వీణాధారిలపై ఉన్న బీమా పత్రాలను తీసుకున్నారు. నిందితుడిపేరుతో పాటు కుటుంబ సభ్యులపై ఉన్న బండ్లగూడ, సుల్తాన్‌బజార్, ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐ బ్రాంచీల్లో బ్యాంక్ ఖాతాలకు చెందిన అకౌంట్ నంబర్లను నమోదు చేశారు.
స్థలాలు: ఓపెన్ ప్లాట్ (సర్వేనం.51, సర్వేనం.52లలో 266 గజాలు) బండ్లగూడ జాగీర్ అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా (రూ.13,30,000), 2016లో శంకర్‌పల్లిలో రెండు ఎకరాల భూమిని రూ.1.5లక్షలకు , మరో 138 గజాల ఓపెన్ ప్లాట్‌ను 1.66లక్షలకు కొనుగోలు చేశారు. తాండూరు, మల్రెడ్డిపల్లిలోని ఇండిపెండెంట్ హౌజ్ 90 గజాల్లో నిర్మాణం. మరొక 109 గజాల ఇల్లు తాండూరులో ఉంది. వాసవీ అట్లాంటీస్లో రూ.15 లక్షలతో విల్లా, 177 గజాల ఓపెన్ ప్లాట్ చిల్కూరు గ్రామంలో ఉండగా.. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ జప్తు చేసింది. పత్రాలపై సాక్షుల సంతకాలు తీసుకున్నారు. 10లక్షల రసీదు గురించి వీణాధరిని అధికారులు ప్రశ్నించగా తనకు ఈ విషయం తెలియదని తప్పించుకున్నారు. ఇద్దరు కుమారులు రంజిత్‌కుమార్, నికేశ్‌కుమార్, ఒక కుమార్తె శివాణి తేజలు ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఇవి పది రేట్లు అధికమని భావిస్తున్నారు.