సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి, ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమగా మాట కలిపింది. మాదాపూర్‌లోని ఓ హోటల్లో గది బుక్ చేశానని ఆశపెట్టింది. ముంబై నుంచి వచ్చేందుకు విమాన టికెట్లు కావాలంటూ సొమ్ము వసూలు చేసింది. ఆశగా వెళ్లిన అతను ఇదంతా మోసమని గ్రహించాడు. నగరం నుంచి గోవాకు వెళ్లిన ఇద్దరు ఐటీ ఉద్యోగులకు అక్కడ అమ్మాయిలను జత చేస్తామంటూ చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి ఆన్లైన్లో రూ.2లక్షలు పంపించి మోసపోయారు. ఇలా సైబర్ నేరగాళ్లు వలపు వల విసిరి బురిడీ కొట్టిస్తున్నారు.
మలక్‌పేట ప్రాంతానికి చెందిన చెందిన 32ఏళ్ల యువకుడు డేటింగ్, లివింగ్ రిలేషన్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో లాగిన్ అయ్యాడు. తన్యాశర్మ అనే యువతి వాట్సప్ కాల్ చేసి రూ.1950 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పార్టనర్ దొరుకుతారని చెప్పింది. ఆమె చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు పంపారు. తర్వాత రితిక, ప్రీతి పేరుతో బాధితుడిని సంప్రదించిన సైబర్‌నేరగాళ్లు ఒంటరిగా కలిసేందుకు ఓకే చెప్పారు. మీటింగ్ నిర్ధారణ, ఎకౌంట్ వెరిఫికేషన్, హోటల్ బుకింగ్, సర్వీస్ టాక్స్ తదితర అంశాల పేరుతో రూ.6.49లక్షలు చెల్లించాలని చెప్పడంతో బాధితుడు దఫాలవారీగా వారికి పంపాడు. ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుండడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని అనుకూలమైన భాగస్వామి కోసం డేటింగ్ యాప్‌లో వెతికింది. తాను యూకేలో డాక్టర్‌నంటూ ఓ వ్యక్తి నమ్మించి చాటింగ్ చేశారు. త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. వ్యక్తిగత అవసరాలంటూ రూ.15లక్షలు కొట్టేసి ఆ తర్వాత ముఖం చాటేశాడు.
అందాన్ని చూసి.. ఆకర్షితులై..
అందమైన రూపం.. ఆకర్షణీయమైన సంపాదన.. ఒక్క క్లిక్‌తో ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ కనికట్లు.. నచ్చిన జోడీని ఎంపిక చేసుకోవచ్చంటూ ఊరింపు.. ఒక్కసారి చిక్కితే చాలు.. జేబులు ఖాళీ. డేటింగ్ యాప్‌ల మోసమిది. సైబర్‌నేరగాళ్లకు ఈ యాప్‌లు ఆదాయ వనరుగా మారగా చాలామంది ఈ యాప్‌ల మోసాల్లో బాధితులుగా మారుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉంటూ యాప్‌ల మాయాజాలానికి చిక్కినట్లు తెలిస్తే తమ పరువు పోతుందని 90శాతం మంది ఫిర్యాదు చేయడానికే ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. సైబర్‌నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. డేటింగ్ యాప్‌ల మాటున కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి.
డేటింగ్ యాప్‌లలో అందమైన అమ్మాయిల ఫొటోలతో ఫేక్ అకౌంట్ సృష్టిస్తున్నారు. ఫ్రెండ్స్ లేరా.. మీరు సింగిలా.. ఒంటరితనంతో బాధపడుతున్నారా.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదా..? అంటూ డేటింగ్ యాప్‌ల గురించి సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని డేటింగ్ యాప్స్ రిజిస్ట్రేషన్‌కు ఛార్జ్జ్ చేస్తుండగా, మరికొన్ని ఉచితంగానే అవకాశమిస్తున్నాయి. డేటింగ్యాప్ల్లో రిజిస్టర్ అయితే అందులో కొందరు వాట్సప్ ద్వారా అవతలి వ్యక్తిని సంప్రదిస్తున్నారు. రొమాంటిక్ కనెక్షన్ పెట్టుకోవడం ద్వారా వారిని దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ యాప్‌లలో దాదాపుగా ఎవరూ సొంత పేర్లతో, ప్రొఫైల్ ఫొటోలతో నమోదు చేసుకోవడం లేదని పోలీసులు చెప్పారు.
ఈ యాప్‌లలో మహిళలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తుండడంతో పురుషులు కూడా మహిళల పేరుతో నమోదు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉచితంగా వీడియోకాల్స్, ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉన్న యాప్‌ల వైపు బాధితులు మొదట్లో మొగ్గు చూపడం, ఆ తర్వాత మోసపోతున్నారని పోలీసులు చెప్పారు. వాట్సప్‌లో అపరిచిత వ్యక్తి నుంచి సందేశం వచ్చినా, బాధితులను ఆకర్షించే లక్ష్యంతో వీడియోల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేసినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. నగరంలో వరుసగా ఈ ఘటనలు వెలుగు చూస్తుండడంతో డేటింగ్ యాప్‌లపై పోలీసుల నిఘా కొనసాగుతున్నదని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.