సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తూ ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక వైబ్సైట్లోకి వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ. 1.59 కోట్లు పొగొట్టుకున్నాడు. పీర్జాదిగూడకు చెందిన బాధితుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ జీబీసీఎక్స్-కాయిన్.కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్లాడు. ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడింగ్ తీసుకునే ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మేనేజ్మెంట్ రిస్క్ తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తామంటూ సూచనలు ఉన్నాయి. దీంతో ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్‌నేమ్, పాస్వర్డ్లు పొందాడు.
బాధితుడి ఫోన్ నంబర్‌ను వాట్సాప్ గ్రూప్‌నకు యాడ్ చేసిన సైబర్‌నేరగాళ్లు ఫోన్లో మాట్లాడారు. బాధితుడు రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. దపదఫాలుగా రూ. కోటి రూపాయల వరకు పెట్టాడు. స్క్రీన్‌పై కోట్ల రూపాయల లాభం కన్పించింది. అయితే అప్పటికే రూ. 1.5 కోట్లకు పైగా స్క్రీన్‌పై కన్పిస్తుండడంతో వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే 30 శాతం పన్ను చెల్లించాలంటూ నేరగాళ్లు సూచించడంతో రూ. 49 లక్షలు తిరిగి చెల్లించాడు. అయితే పే పాల్ ఎక్సేంజ్ ట్యాక్స్ రూ. 19 లక్షలు చెల్లించాలంటూ షరతు విధించడంతో బాధితుడికి అనుమానం వచ్చి సైబర్‌క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేస్తున్నారు.